Begin typing your search above and press return to search.

మందుకు వేల మంది ఏమిటి? చావుకు 20 మంది మాత్రమేనా?

By:  Tupaki Desk   |   9 May 2020 5:10 AM GMT
మందుకు వేల మంది ఏమిటి? చావుకు 20 మంది మాత్రమేనా?
X
కొన్ని రూల్స్ ను చూస్తే ఒళ్లు మండిపోతాయి. ఎలాంటి పరిస్థితైనా కావొచ్చు.. ఒకదానికి మరోదానికి పొంతన లేని రీతిలో ఉండే నిబంధనలు సరి కావంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరవాలనిపిస్తుంది. మాయదారి రోగం ప్రపంచం మొత్తాన్ని ముసురేసిన వేళ.. ఎవరిళ్లల్లో వారు ఉండిపోవాలన్న తాఖీదును ఇచ్చేసింది సర్కారు. అంతేనా.. పెళ్లిళ్లు లాంటి శుభకార్యాల్ని వాయిదా వేయాలని చెప్పింది.

పెళ్లిళ్లు ఆపుతారు కానీ చావులు ఆపలేరు కదా? అందుకే.. మరణం వేళ.. అంతిమయాత్రలో ఇరవై మందికి మించి ఉండకూడదన్న రూల్ పెట్టేసింది. దీంతో.. ఎంతోమంది ఉన్నా.. ఎవరూ లేని వారిగా చనిపోతున్న వైనం గుండెలు కలుక్కుమనేలా చేస్తున్నాయి. దరిద్రపుగొట్టు కాలంలో బతుకుతున్నాం కాబట్టి.. సర్దుకుపోదామనుకుంటే.. మద్యం దుకాణాల్ని తెరిచేందుకు అనుమతిచ్చిన వైనం చూసినప్పుడు మాత్రం కాలి కంకరెక్కుతుంది.

మనిషి చచ్చిపోతే ఇరవై మందికి మించి ఉండకూడదని పెట్టే రూల్.. మందు కొనటానికి మాత్రం వందలాదిగా.. కొన్ని చోట్ల అయితే వేలాదిగా ఒకే చోట పోగుపడటానికి అనుమతి ఎలా ఇస్తారన్న ప్రశ్న వింటే.. నిజమే కదా? అనిపించక మానదు. ఇదే అంశాన్ని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా మండిపడుతున్నారు. అంతిమయాత్రకు కేవలం 20 మందికే అమనుతి ఇస్తున్న ప్రభుత్వం.. మద్యం దుకాణాల వద్ద మాత్రం వందలాదిగా ఉండేందుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.

తన వాదనను ఆయన వ్యంగ్య వ్యాఖ్యతో ట్వీట్ చేశారు. శవయాత్రకు 20 మంది మాత్రమే అనుమతించారు. ఎందుకంటే స్పిరిట్ (ఆత్మ) అప్పటికే శరీరాన్ని వదిలి వెళ్లి ఉంటుందని. అదే మద్యం షాపుల ముందు మాత్రం వేలాది మందికి అనుమతిచ్చారు. ఎందుకంటే మద్యం దుకాణాల్లోనే స్పిరిట్ (మందు) ఉంటుంది కాబట్టి అంటూ పంచ్ వేశారు. నిజమే కదా?