Begin typing your search above and press return to search.

రాజకీయాలకు ఇక విరామం - పత్రిక పనులు చూసుకుంటారట!

By:  Tupaki Desk   |   28 Nov 2019 9:57 AM GMT
రాజకీయాలకు ఇక విరామం - పత్రిక పనులు చూసుకుంటారట!
X
గత పక్షం రోజుల్లో వార్తా పత్రికల్లో బాగా వినిపించిన పేరు సంజయ్ రౌత్. ఈ శివసేన నేత పేరు మార్మోగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి రౌత్ వాయిస్ గట్టిగా వినిపిస్తూ వచ్చింది. ఆ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ-శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన దశలో సంజయ్ రౌత్ స్పందన మొదలైంది. ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ తమకు పంచాలని శివసేన తరఫున డిమాండ్ చేశారు సంజయ్ రౌత్.

మొదట అది సాదాసీదా డిమాండే అని అంతా అనుకున్నారు. బీజేపీని బెదిరించి కొన్ని మంత్రి పదవులను ఎక్కువగా తీసుకోవడానికి శివసేన ఆ డిమాండ్ చేస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అది కూడా బీజేపీ తరచూ అదిలించే సంజయ్ రౌత్ స్పందన కావడంతో ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.

అయితే చివరకు అదే సీరియస్ గా మారింది. సంజయ్ రౌత్ డిమాండ్ కు శివసేన కట్టుబడింది. ఆ తర్వాత అనునిత్యం రన్నింగ్ కామెంట్రీ చెబుతూ వచ్చారు రౌత్. ముందుగా వెళ్లి శరద్ పవార్ తో చర్చలు జరిపింది కూడా ఈయనే. ఒకవైపు బీజేపీ, శివసేనల బంధం చెడిపోక ముందు నుంచినే.. ఎన్నికల ఫలితాలు రాగానే శరద్ పవార్ తో సమావేశం అయ్యారు రౌత్.

అలా ఠాక్రేల తరఫున ప్రతినిధిగా రౌత్ చెలరేగిపోయారు. శరద్ పవార్ తో రౌత్ చర్చలు జరపడం బీజేపీకి బహిరంగ హెచ్చరికలాగా నిలిచాయి. ఆ తర్వాత బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఝలక్ ఇచ్చినప్పుడు కూడా రౌత్ తీవ్రంగా స్పందించారు. అంతలోనే ఆయన అస్వస్థుడు అయ్యి ఆసుపత్రి పాలయ్యారు.

వెంటనే కోలుకుని డిశ్చార్జ్ అయ్యి వచ్చి. .బీజేపీ మీద మళ్లీ విరుచుకుపడటం ప్రారంభించారు. శివసేన తరఫున చర్చలు జరుపుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు.తమ ఒప్పందాల గురించి మీడియాకు ఎప్పటికిప్పుడు హాట్ హాట్ వార్తలను అందించారు రౌత్.

ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో, శివసేన అధినేత సీఎం కావడంతో తన బాధ్యత తీరిందని - ఇక ‘సామ్నా’ పత్రిక బాధ్యతలు చూసుకోనున్నట్టుగా రౌత్ ప్రకటించారు. శివసేన అధికారిక పత్రిక అయిన ‘సామ్నా’కు రౌత్ ఎడిటర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ పత్రికలో ఆయన కాలమ్స్ శివసేన అజెండాను చాటుతూ ఉంటాయి.