Begin typing your search above and press return to search.

మోడీ మాట‌ల్ని మిత్రుడు సైతం త‌ప్పు ప‌ట్టారు!

By:  Tupaki Desk   |   10 May 2018 6:07 AM GMT
మోడీ మాట‌ల్ని మిత్రుడు సైతం త‌ప్పు ప‌ట్టారు!
X
వేలెత్తి చూపించే వారు త‌మ వైపు కూడా వేళ్లు చూపిస్తూ ఉంటాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడదు. నిత్యం నీతులు వ‌ల్లించే మోడీ మాష్టారు.. ఎన్నిక‌లు వ‌స్తే చాలా చెల‌రేగిపోతారు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా మాట్లాడే ఆయ‌న కాస్తా.. ఒక్క‌సారి ఫైర్ బ్రాండ్ అయిపోతారు.

ప్ర‌త్య‌ర్థుల‌పై వెన‌కాముందు చూసుకోకుండా మాట‌ల‌తో మంట పుట్టిస్తారు. ప్ర‌తి చిన్న విష‌యంలోనూ త‌ప్పులు ఎత్తి చూపిస్తూ త‌న‌లోకి కొత్త కోణాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఇత‌రుల‌కు తాను చెప్పే సుద్దులు.. తాను సైతం పాటించ‌న‌న్న వైనాన్ని మ‌ర్చిపోతుంటారు. తాజాగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌టం ద్వారా మోడీ త‌ప్పులో కాలేశారు.

విప‌క్షాలే కాదు.. చివ‌ర‌కు స్వ‌ప‌క్షంలోని వారు సైతం మోడీ మాట‌ల్ని త‌ప్పు ప‌డుతున్నారు. మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంలో తాను ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు చేయ‌టాన్ని మోడీ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన వైనం తెలిసిందే. మోడీ వ్యాఖ్య‌ల్ని ఇప్ప‌టికే ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు. ఇదిలా ఉంటే.. బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా ఉంటూ.. ఆయ‌న త‌ప్పు చేసిన ప్ర‌తిసారీ విమ‌ర్శ‌ల‌తో మోత పుట్టించే శివ‌సేన తాజాగా ప్ర‌ధాని వ్యాఖ్య‌ల్ని త‌ప్పు ప‌ట్టింది.

ప్ర‌ధానిగా ప‌గ్గాలు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌న్న రాహుల్ మాట‌ల్ని త‌ప్పు ప‌ట్ట‌టం స‌రికాదంటూ శివ‌సేన సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్ అబిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యంపై విశ్వాసం ఉంటే నాయ‌కుల్ని ఇలా కించ‌ప‌ర్చ‌టం.. వ్య‌క్తిగ‌త దాడుల‌కు పాల్ప‌డ‌టం స‌రికాదంటూ హిత‌వు ప‌లికారు. ప్ర‌తి పార్టీలోనూ అత్యున్న ప‌ద‌వికి నేత‌లు క్యూ క‌డుతుంటార‌ని.. గ‌తంలోప్ర‌ధాని కుర్చీలో కూర్చోవ‌టానికి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ.. ఆస‌క్తి చూపినా మ‌న్మోహ‌న్ ప్ర‌ధాని అయ్యార‌ని.. అదే రీతిలో బీజేపీలో ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి.. అద్వానీలు మ‌క్కువ ప్ర‌ద‌ర్శించినా మోడీ ప్ర‌ధాని కావ‌టాన్ని గుర్తు చేశారు. రాహుల్ పై మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్న వేళ‌.. మిత్ర‌ప‌క్ష నేత‌లు సైతం మోడీని త‌ప్పు ప‌ట్ట‌టం గ‌మ‌నార్హం.