Begin typing your search above and press return to search.

సానియా.. అతగాడి మాటలకు ఫైటింగ్ ఎంతంటే..

By:  Tupaki Desk   |   19 Oct 2016 6:01 PM GMT
సానియా.. అతగాడి మాటలకు ఫైటింగ్ ఎంతంటే..
X
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎవరు ఎక్కడున్నా.. తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి. ట్విట్టర్ పిట్టతో ట్వీట్ కేక.. సెగలు పుట్టించే పరిస్థితి. దీన్నితమకు అనుకూలంగా మార్చుకొని కొంతమంది పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకుంటే.. మరికొందరు ఉత్సాహవంతులు లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకుంటున్న పరిస్థితి. ట్విట్టర్ పుణ్యమా అని అత్యున్నత స్థాయిలో ఉన్న పలువురు తమ పదవుల్ని పోగొట్టుకున్న వైనాన్ని మర్చిపోలేం.

తాజాగా.. ఇద్దరు క్రీడా ప్రముఖుల మధ్య నడిచిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రముఖంగా మారింది. తాను సాధించిన ఘనత గురించి చాటుకున్న టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాకు.. చిన్నపాటి కౌంటర్ ను ఇచ్చేలా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రయత్నించటం.. దానికి ఒళ్లు మండిన సానియా ఘాటుగా రియాక్ట్ కావటంతో.. పరిస్థితి చేజారి.. అంతకంతకూ పెరిగి ఎక్కడికో వెళ్లిన పరిస్థితి. ఇద్దరు ప్రముఖ క్రీడాకారుల మధ్య నడిచిన మాటల యుద్ధం పలువురిని విస్మయానికి గురి చేసింది.

ఇంతకీ ఈ వ్యవహారమంతా ఎలా స్టార్ట్ అయ్యిందంటే.. తాను ప్రపంచ నెంబర్ వన్ గా మారి బుధవారినిక 80 వారాలు పూర్తి అయ్యిందని.. దానికి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సానియామీర్జా ట్వీట్ చేశారు. దీనికి పలువురు ప్రముఖులు కంగ్రాట్స్ చెప్పారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కాస్త భిన్నంగా.. నువ్వనేది డబుల్స్ లో నెంబర్ 1 అనే కదా? అంటూ కాస్తంత కొంటెగా.. ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా ట్వీట్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు.

ఈ కొంటె మాట సానియాకు చిరాకు పుట్టించటమేకాదు.. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసినట్లుగా ఫీలైనట్లుగా కనిపిస్తోంది. సంజయ్ ట్వీట్ కు బదులుగా.. సింగిల్స్ ఆడటం లేదంటే డబుల్స్ అనుకోవటమే కదా కామన్ సెన్స్. కామన్ సెన్స్ అనేది అంత కామన్ కాదనుకుంటా అంటూ తన అక్కసును కాస్త కఠినంగా వెళ్లగక్కింది. దీంతో.. సంజయ్ తాను అన్న మాటల్లో తప్పు లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. కామన్ సెన్స్ లోపించిన నాలాంటి వాళ్ల కోసం నువ్వు పూర్తి వివరాలు ఇవ్వలేదుగా? అంటూ బదులిచ్చాడు. దీంతో.. బ్యాలెన్స్ మిస్ అయిన సానియా వెంటనే తన రికార్డుకు సంబంధించిన వెబ్ సైట్ లో పెట్టిన వార్తకు సంబంధించిన లింకును పోస్ట్ చేసింది.

సదరు వార్తలోనూ.. తాను చెప్పినట్లే డబుల్స్ నెంబర్ వన్ అనే ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. ఇక అన్ని బంతుల్ని ఆఫ్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వైపు వదిలేద్దాం అంటూ ఎంత ఎటకారం చేయాలో అంత ఎటకారం చేశారు. అయినా.. నెంబర్ వన్ అని చెప్పుకునేటప్పుడు.. సింగిల్సా.. డబుల్సా అన్న విషయాన్ని కాస్త వివరంగా చెప్పి ఉంటే సానియా మీర్జాకు సరిపోయేది కదా. ఒకవేళ.. కొంటెగా స్పందిస్తే.. చెలరేగిపోకుండా.. హుందాగా వివరణ ఇస్తే అక్కడితో ముగిసిపోయే ముచ్చటకు ఇంత రచ్చ చేసుకోవాలా? అని అనిపించక మానదు. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే.. ఆటల్లో గొప్పొళ్లే కానీ.. వ్యవహారాల్లో మాత్రం సాదాసీదా అని అనిపించట్లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/