Begin typing your search above and press return to search.

కరోనా తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో భలేగా చెప్పిన సానియామీర్జా

By:  Tupaki Desk   |   18 April 2020 9:45 AM IST
కరోనా తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో భలేగా చెప్పిన సానియామీర్జా
X
ప్రపంచంలో ఏ మూల చూసినా కరోనా..కరోనా.. కరోనానే. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ ఇంత దారుణ పరిస్థితిని ప్రపంచం చూడలేదేమో? కరోనాతో పోలిస్తే ప్రపంచ యుద్ధాల కారణంగా భారీగా ప్రాణనష్టం.. ఆస్తి నష్టం జరిగిందేమో కానీ.. యావత్ ప్రపంచం మొత్తం వణికిపోయేలా స్తంభించిన పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. కరోనా పుణ్యమా అని ప్రపంచ ఆర్థిక వ్యవస్థే మారిపోయింది. తుపాకీ గుండు పేలకుండానే ప్రపంచం మొత్తాన్ని మార్చేసిన ఘనత కరోనాకే చెల్లుతుందని చెప్పాలి.

ఇలాంటివేళ.. ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామో ఇతిమిద్దంగా తెలీని వేళ.. కరోనా తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాన్ని చెప్పిన తీరు చూస్తే.. ఇలా ఉంటుందా? అని విస్మయానికి గురి కావటం ఖాయం. ఎవరికి వారు వారి రంగం మీద పడే ప్రభావాన్ని లోతుగా విశ్లేషించటం మామూలే. సానియా సైతం ఇందుకు మినహాయింపు కాదు.

కరోనా తర్వాత ప్రపంచం ఎంతలా మారిపోతుందో ఆమె చెప్పిన వైనం ఆసక్తికరంగానే కాదు.. వాస్తవానికి దగ్గరగా ఉందని చెప్పక తప్పదు. పదిహేడు నెలల క్రితం బాబుకు జన్మనిచ్చిన సానియా.. టెన్నిస్ కు రీఎంట్రీ ఇచ్చే వేళలో కరోనా ఆమె ఆశల్ని ఆడియాశల్ని చేసింది. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనాలనుకున్న ఆమె కలల్ని కల్లల్ని చేసింది. ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే చూస్తే..

‘‘అంతా సిద్దమైన వేళ కరోనా వచ్ింది. ఇప్పుడంతా మారి పోతుంది. ఆటలో లయ తప్పుతుంది. మళ్లీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతా బాగైతే మళ్లీ ఆడగలను కానీ రీఎంట్రీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా క్రీడాపోటీల్లో కొత్త వాతావరణం కనిపిస్తుంది. అదెంత అన్నది సరిగ్గా చెప్పలేం. సాధారణ జీవితం కూడా మారిపోతుంది. ప్రతి ఒక్కరు మరొకరిని చూసి భయపడతారేమో? ఇప్పటికే చాలా మారింది. ఎందరినో కలుస్తాం. ఆత్మీయంగా ఆలింగనం కూడా చేసుకోలేం. ఆటలు కూడా మారిపోతాయి. కొత్త ఆలోచనలు మనల్ని నడిపిస్తాయి. ఇప్పటిలా మాత్రం రానున్న రోజుల్లో ఆటలు ఉండవు’’ అని పేర్కొన్నారు.

‘‘మిగిలిన ఆటలతో పోలిస్తే టెన్నిస్ కే పెద్ద దెబ్బ. 200 దేశాల్లో దీన్ని ఆడుతున్నారు. ఏ ఒక్క చోట కరోనా తగ్గలేదంటే దాని ప్రభావం టెన్నిస్ మీద ఉంటుంది. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణం చేయలేకపోతే టోర్నీ జరిగే అవకాశం ఉండదు. టెన్నిస్ కు ఇదే పెద్ద సమస్య. క్రికెట్ కు అలాంటిదేమీ ఉండదు. టోర్నీ జరగాలంటే రెండు దేశాల్లో కరోనా లేకుంటే ఆడే వీలు ఉంటుంది. టెన్నిస్ లో అలాంటి పరిస్థితి ఉండదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రేక్షకులు లేకుండా ఆడటం ఊహించలేమని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు లేకుండా ఆడేందుకు తనకు సమస్య లేదన్న సానియా.. ఆట ఆడేందుకు ప్రయాణమే పెద్ద సమస్యగా అభివర్ణించారు. లాక్ డౌన్ కారణంగా తిండి..ఇల్లు లేని వారి గురించి ఆలోచించాలన్న ఆమె.. సోమ్ దేవ్ నేతృత్వం లో జూనియర్లను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. తన కొడుకును ఎందుకు బయటకు తీసుకెళ్లటం లేదో అర్థమయ్యేలా చెప్పటం సాధ్యం కావట్లేదంది. అందుకే.. టెన్నిస్ కోర్టుకి తీసుకెళ్లటం మినహా ఏమీ చేయటం లేదని చెప్పింది.