Begin typing your search above and press return to search.

కోర్టు మెట్లెక్కిన సంగం డైరీ వివాదం

By:  Tupaki Desk   |   28 April 2021 5:30 AM GMT
కోర్టు మెట్లెక్కిన సంగం డైరీ వివాదం
X
మొత్తానికి గుంటూరు జిల్లాలోని సంగం డైరీ వివాదం కోర్టు మెట్లెక్కింది. డైరీలో అక్రమాలు, అవినీతి జరగిందని ఒకవైపు ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే దూళిపాళ నరేంద్ర ఆధ్వర్యంలోని డైరీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు మొదలుపెట్టిందని చంద్రబాబునాయుడు అండ్ కో ఆరోపణలతో ఎదురుదాడులు మొదలుపెట్టింది. నరేంద్రకు మద్దతుగా డైరీ పాలకవర్గం కోర్టులో ఇప్పటికే కేసు వేసింది. రేపో మాపో టీడీపీ కూడా కేసు వేయబోతోందని సమాచారం.

అవినీతి, అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికే నరేంద్రతో పాటు ఎండి గోపాలకృష్ణను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ ప్రత్యేకకోర్టు నరేంద్ర+గోపాలకృష్ణకు 14 రోజుల రిమాండ్ కు పంపింది. సంగం డైరీని స్వాధీనం చేసుకుని అమూల్ డైరీని బలోపేతం చేయటమే టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచించినట్లు టీడీపీ+నరేంద్ర మద్దతుదారులు నానా గోల చేసేస్తున్నారు. అయితే నరేంద్ర అక్రమాలు, అవినీతికి పాల్పడినట్లు ఆధారాలున్న కారణంగానే కేసుపెట్టి అరెస్టు చేసినట్లు ఏసీబీ ఉన్నతాధికారులు చెప్పారు.

నిజానికి డైరీలో అక్రమాలు, అవినీతిపై ఎప్పటినుండో ఆరోపణలు వినబడుతున్నాయి. వివిధ కారణాలతో ఇంతకాలం డైరీపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. నరేంద్ర టీడీపీ సీనియర్ నేత కాబట్టే ఆరోపణలపై వాళ్ళ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. నరేంద్ర వ్యవహారశైలిని ప్రశ్నించిన పాల సొసైటీ అధ్యక్షులపై అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందనే ఆరోపణలు ఇపుడు వినబడుతున్నాయి.

డైరీ భూమిని సొంత ట్రస్టుకు బదిలీ చేసుకుని నిర్మాణాలు చేయటం, భూములను కుదవపెట్టి సుమారు రు. 200 కోట్లు అప్పు తీసుకోవటం లాంటి అనేక ఆరోపణలు నరేంద్రపై ఉన్నాయి. పాల సొసైటీ అధ్యక్షుల అంగీకారం లేకుండానే మ్యాక్స్ చట్టం పరిధిలోని డైరీని నరేంద్ర కంపెనీల చట్టం పరిధిలోకి మార్చేశారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

ఈ ఆరోపణలన్నింటిపైనా ఏసీబీ ఉన్నతాధికారులు విచారణ జరిపి సాక్ష్యాలను సేకరించిన తర్వాతే అరెస్టు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. నరేంద్ర టీడీపీ మాజీ ఎంఎల్ఏ కాబట్టే వివాదం బాగా ముదిరిపోతోంది. అంతిమంగా ఈ వివాదాన్ని కోర్టు ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాల్సిందే.