Begin typing your search above and press return to search.

ఏపీలో ఇసుక తుపాను

By:  Tupaki Desk   |   19 Sep 2015 2:36 PM GMT
ఏపీలో ఇసుక తుపాను
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ లో పెద్ద ఎత్తున భ‌వనాలు నిర్మించాల్సిన స‌మ‌యంలో స‌మ‌యంలో తాము కొత్త‌ప‌నులు చేయ‌బోమంటూ బిల్డ‌ర్లు మొండికేశారు. చిత్రంగా ప్ర‌భుత్వ విధాన‌మే బిల్డ‌ర్లు ఈ నిర్ణ‌యం తీసుకునేందుకు కార‌ణం కావ‌డం ఆస‌క్తిక‌రం.

ఏపీలో ఇసుక కొరత నిర్మాణ రంగానికి సవాల్‌ గా మారింది. మీ ఇంటికి ఇసుక పథకం పేరు బాగున్నా.. మేం ఇల్లు కట్టాలంటే దొరకడం లేదని ఏపీ బిల్డర్స్ గగ్గోలు పెడుతున్నారు . స్థానిక అవసరాలు తీరాకే ఇతర ప్రాంతాలకు తరలించాలన్న నిబంధనతో ఇసుక లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో బిల్డర్స్‌ విలవిల్లాడుతున్నారు. విశాఖ సిటీనే ఇందుకు ఉదాహరణ. ఇసుక‌ పాలసీ రాకముందు ఒక్కో క్యూబిక్ మీటర్ ఇసుకకు రవాణాఖర్చులతో కలిపి 760 రూపాయలు అయ్యేది. కానీ.. ఇప్పుడు అదే ఇసుక కోసం 1760 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని భవన నిర్మాణ సంఘం సభ్యులు వాపోతున్నారు. అయితే అంత మొత్తం చెల్లించేందుకు సిద్ధపడ్డా కావాల్సినంత స్టాక్‌ ఉండటం లేదంటున్నారు. భవన నిర్మాణం మంచి ఊపుమీదున్న విశాఖలో ఇసుక కొరత స‌మ‌స్య వేధిస్తోంది. ఈ సమస్యతో ఇక్కడ ఇప్పటికే 400 నిర్మాణాలు ఆగిపోయాయి. విశాఖకు అవసరమైన ఇసుకలో ఎక్కువ శాతం శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వస్తోంది. ఐతే ప్రస్తుతం ఆయా జిల్లాల్లో స్ధానిక అవసరాలు తీరిన తర్వాతే విశాఖకు రవాణా చేసేందుకు అనుమతి లభిస్తోంది.

డీఆర్‌ డీవో నోడల్‌ ఏజెన్సీగా స్థానికంగా సరఫరా చేస్తున్న ఇసుకలో నాణ్యత ఉండటం లేదని, దానితో కడితే తమ పేరు దెబ్బతింటుంద‌ని బిల్డర్స్ అంటున్నారు. డ్వాక్రా సంఘాలు నిర్వహిస్తున్న ర్యాంపుల్లో నో స్టాక్‌ బోర్డ్‌ లు కనిపిస్తుంటే ప్రైవేట్‌ ర్యాంపుల దగ్గర ఫుల్‌ స్టాక్‌ విత్‌ ఎక్స్‌ ట్రా రేట్‌ ఉంటోందని, అదెలా సాధ్యమని నిర్మాణ‌రంగ కంపెనీల వేదిక అయిన క్రెడాయ్‌ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. కొత్త నిబంధనల పేరుతో జరుగుతున్న తంతు శాండ్‌ మాఫియాకు మాత్రమే లాభం చేకూరుతుందంటున్నారు. అందుకే 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు ఆపేస్తున్నామని ప్రకటించారు. మ‌రోవైపు వర్షాలు కురుస్తుండటంతో ఇసుక రీచ్ లు నీటమునిగిపోయే అవకాశం వుంది. అదే జరిగితే మరికొన్ని రోజుల పాటు విశాఖకు అవసరమైన ఇసుక దొరకదని నిర్మాణ సంస్ధలు కలవరపడుతున్నాయి. విశాఖ ప్ర‌తిష్ట దెబ్బ‌తీసే విధంగా ప‌రిస్థితులు మారుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది.