Begin typing your search above and press return to search.

ఇసుక వ్యథ.. ఏపీలో పరిస్థితికి కారకులెవ్వరు?

By:  Tupaki Desk   |   29 Oct 2019 7:05 AM GMT
ఇసుక వ్యథ.. ఏపీలో పరిస్థితికి కారకులెవ్వరు?
X
ఏపీలో ఇసుక కొరత సమస్య తీవ్రమవుతోంది. రోజురోజుకూ ఇసుక లభ్యత గగనమైపోతోంది. ఎన్నో నదులు, వాగులు, విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉన్నా పుష్కలంగా లభించే ఇసుక దొరకడం కష్టంగా మారింది. ట్రాక్టర్ ఇసుక కూడా దొరక్క నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు.

టీడీపీ హయాంలో ప్రకృతి సంపద అయిన ఇసుకను ఆ పార్టీ నేతలు ఎంతలా బొక్కేశారో వెల్లువెత్తిన విమర్శలను చూశాం. అందుకే వైసీపీ సర్కారు గద్దెనెక్కాక కొత్త ఇసుక విధానం తీసుకొచ్చింది. ఇసుకను పారదర్శకంగా.. తక్కువ ధరకే అందించడానికి ఏపీఎండీసీ ద్వారా ప్రయత్నాలు చేసింది.

ఆన్ లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవడం నిర్మాణదారులకు శరాఘాతంగా మారుతోంది. ఇలా సైట్ ఓపెన్ కాగానే క్షణాల్లోనే అలా ఇసుక అయిపోతోంది. దీంతో ఇసుక కొరతతో నిర్మాణాలు ఆగిపోతున్నాయి. నిర్మాణదారులు గగ్గోలు పెడుతున్నారు. కూలీలకు వారంలో 2 రోజులు పని దొరకడం లేదు. తాజాగా ఇలానే ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదలై ఓ ప్లంబర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసగా కార్మికుల ఆత్మహత్యలు కూడా కలిచివేస్తున్నాయి. .

ఇక ఇసుక కొరతకు ప్రధాన కారణం.. భారీ వర్షాలు.. గోదావరి, కృష్ణా, వంశధార నాగవాళి , తుంగభద్ర నదుల్లో ఉధృతంగా నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో ఏపీఎండీసీకి ఇసుకను తవ్వి నిల్వ చేసి నిర్మాణదారులకు ఇవ్వడం సాధ్యపడడం లేదు. ఇక ఎపీఎండీసీ అధికారుల నిర్లక్ష్యం కూడా జగన్ ప్రభుత్వానికి షాపంగా మారింది. రాష్ట్రంలో నిత్యం ఇసుక అవసరం 1.50 లక్షల టన్నులు కాగా.. కేవలం 15-20 వేల టన్నులే లభ్యమవ్వడంతో నిర్మాణ రంగం దానిపై ఆధారపడ్డ వేలాది మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.

అయితే కొందరు అక్రమార్కులు మాత్రం యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. కృష్ణా, గుంటూరు నుంచి హైదరాబాద్ కు, అనంతపురం, కడప జిల్లాల నుంచి బెంగళూరు, నెల్లూరు, చిత్తూరు నుంచి చెన్నైకి తరలించి 80వేల నుంచి లక్ష రూపాయలకు అమ్ముకుంటున్నారు. రాత్రి వేళల్లోనే ఈ దందా జరుగుతోంది.

కింది స్థాయి నేతల ప్రమేయంతో అధికారులు, పోలీసులు ఇలా ఉన్న ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకోవడం జగన్ సర్కారుకు తలవంపులు తెస్తోంది. ఇక్కడ ఇసుక దొరకకుండా నానా అగచాట్లు పడుతుంటే ఏపీఎండీసీ అధికారులు పట్టించుకోకపోవడం.. కొందరు ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతున్నా అధికారులు మామూళ్ల మత్తులో మిన్నకుండడం.. జగన్ ప్రభుత్యానికి అపఖ్యాతులు తెస్తోంది.. ఇసుక సమస్యను తీర్చడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కింది స్థాయి నేతుల, అధికారుల వల్ల జగన్ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోంది.