Begin typing your search above and press return to search.

తెలంగాణలోనూ ఇసుక ఆరాచకం

By:  Tupaki Desk   |   21 Sep 2015 4:29 AM GMT
తెలంగాణలోనూ ఇసుక ఆరాచకం
X
రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని అధికారపక్షానికి చెందిన నేతల ఇసుక భాగోతాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ‘ఈనాడు’.. తాజాగా తెలంగాణలోని ఇసుక దందాను భారీగానే ప్రచురించింది.

ఏపీలో ఇసుక దందా భారీగా సాగుతుందని.. అధికారపక్షానికి చెందిన నేతల కనుసన్నల్లో సాగుతున్న ఈ ఇసుక దందాలోజిల్లాల వారీగా ఏయే నేత ఎంత మేర ప్రమేయం ఉందన్న విషయాన్ని పేరు బయట పెట్టకుండా ప్రచురిస్తే.. తాజాగా తెలంగాణలోని నేతల ఇసుక దాహాన్ని ప్రచురించింది. మొత్తంగా ఇసుక రాకెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత భారీగా ఉందన్న విషయాన్ని బయటకు తీసుకొచ్చిందని చెప్పక తప్పదు.

మొన్నటి ఏపీలో ఇసుక కుంభకోణంతో నెలకు రూ.2వేల కోట్లకు పైనే ఆదాయం ఆర్జించి పెడుతుందన్న లెక్కను చెప్పినా.. తాజాగా తెలంగాణలో మాత్రం మొత్తం లెక్క చెప్పనప్పటికీ.. జిల్లాల వారీగా దందాను ప్రస్తావించి.. నేతల ప్రమేయాన్ని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథనంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. జిల్లాల వారీగా చూస్తే.. అక్రమ దందా విషయంలో రాజకీయ విభేదాలు పక్కన పెట్టేసి.. కుమ్మక్కు అయి కోట్లాది రూపాయిలు కొల్ల గొట్టేయటం కనిపిస్తుంది.

ఇసుక కారణంగా ఏపీ ముఖ్యమంత్రికి ఎంత అప్రదిష్టను తెచ్చి పెడుతుందన్నట్లుగా రాసిన కథనం.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మేలుకొలుపుగా ఈ కథనాన్ని అభివర్ణిస్తున్నారు. మరి.. ఈ ఇసుక యవ్వారంపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. తెలంగాణ ప్రభుత్వ పరపతిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ ఇసుక దందా జిల్లాల వారీగా చూస్తే..

నిజామాబాద్

= మంత్రిగారి అబ్బాయిదే ఈ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాలో హవా. అబ్బాయిగారి స్పీడుకు మరో కీలక మంత్రి జోక్యం చేసుకొని బ్రేకులు వేయటంతో కాస్త తగ్గారంట. అయితే.. రవాణా విషయంలో కాస్త తగ్గినా.. దందాను మాత్రం ఆపలేదంట. వచ్చిపడే కాసుల్ని ఎవరు మాత్రం వదులుకుంటారు?

= జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే రాష్ట్రంలో కాకుండా.. మహారాష్ట్ర కేంద్రం ఇసుక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడట.

= జిల్లాకు చెందిన ఇంకో ఎమ్మెల్యే ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను ‘టోకు’గా అమ్మేస్తున్నాడట.

నల్గొండ

= ఈ జిల్లాలో అధికారపక్షం కంటే విపక్ష నేతల అక్రమ రవాణానే భారీగా ఉందట.

= గతంలో ఎపీపీఎస్సీ ఛైర్మన్ గా పని చేసిన ఒక కాంగ్రెస్ నేత మనమడు ఇసుక అక్రమ రవాణాలో హవా చూపిస్తున్నాడట.

= మూసీ ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే హవా నడుస్తోందట.

= మండలికి చెందిన కొందరు అధికారపక్షానికి చెందిన నేతల ఇసుక దందాను ఓ రేంజ్ లో చేస్తున్నారట.

మహబూబ్ నగర్

రాజకీయంగా విభేదాలు ఉన్నా.. ఇసుక అక్రమ దందా వచ్చేసరికి రాజకీయంగా ఉండే విభేదాల్ని పక్కన పెట్టిన కుమ్మక్కు అయిపోయిన చిత్రమైన పరిస్థితి కనిపిస్తోందట.

= విపక్షాలు చేసే అక్రమ రవాణాకు.. అధికారపక్ష నేతల అండ ఉంటుందట.

= జిల్లాకు చెందిన కొందరి నేతల పాత్ర ఉందట.

= కర్నూలు జిల్లా నుంచి వెళుతున్న లారీల్లో తన వాటా సంగతేమిటంటూ ఓ ఎమ్మెల్యే చిందులు తొక్కారట.

= జిల్లాకు చెందిన ఓ మంత్రిగారి అబ్బాయి.. ఇసుక మాఫియాకు సంబంధించి కీలమంట.

వరంగల్

= జిల్లాల్లోని ఇసుక రీచ్ లలో ఇసుక తవ్వేందుకు అనుమతులు పొందిన గిరిజనుల స్థానే.. హైదరాబాద్ కు చెందిన ఒక నేత పనులు చేయిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నాడట.

= అధికారపార్టీకి చెందిన కీలక నేత కొడుకు సాయంతో జిల్లాలోని ఇసుక రీచ్ లను నిజామాబాద్ కు చెందిన ఒక నేత చేజిక్కించుకొని కోట్ల రూపాయిలు వెనకేస్తున్నాడట.

= జిల్లాకు చెందిన మరో నేత.. అనధికారికంగా పనులు చేజిక్కించుకొని లక్షలాది రూపాయిల్ని జేబులో వేసుకుంటున్నాడట.

కరీంనగర్

= ఓ ఎమ్మెల్యే అనుచరులే ఇసుక దందాను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నడిపిస్తున్నారట.

ఖమ్మం

= జిల్లా స్థాయి నేతలందరికీ ఇసుక దందాతో సంబంధాలు ఉన్నాయట.

= ఎవరికి వారు వారి వాటాను నెలకో మారు పంచేసుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా బండి నడిపిస్తున్నారట

అదిలాబాద్

= జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇసుక దందాతో సంబంధాలు ఉన్నాయట.

= ఈ ముగ్గురు నేతలు నెలవారీగా మామూళ్లు తీసేసుకుంటూ.. ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారట.