Begin typing your search above and press return to search.

గుడివాడలో ఆర్ఐపై మట్టి మాఫియా హత్యాయత్నం

By:  Tupaki Desk   |   22 April 2022 7:08 AM GMT
గుడివాడలో ఆర్ఐపై మట్టి మాఫియా హత్యాయత్నం
X
మంత్రి పదవి పోగొట్టుకున్న వైసీపీ నేత కొడాలి నాని ఇలాఖాలో మరో దుమారం చెలరేగింది. ఇప్పటికే 'క్యాసినో' వివాదంలో ఇరుక్కొన్న కొడాలికి తాజా వివాదం మరింత ఇరుకునపెట్టింది. కృష్ణా జిల్లా గుడివాడలో మోటూరు మట్టి మాఫియా ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై నారా లోకేష్ మండిపడ్డారు. అధికారపక్ష నేతలు బరితెగించి అధికారులపై దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు.

కృష్ణా జిల్లాలోని గుడివాడ మండలం మోటూరులో గురువారం రాత్రి ఆర్ఐపై దాడి జరిగింది. అక్రమ మట్టి తవ్వకాలను స్థానిక ఆర్ఐ అడ్డుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన మట్టి మాఫియా ఏకంగా ఆర్ఐపై హత్యాయత్నానికి దిగింది. కొన్నిరోజులుగా రాత్రివేళ అధికార పార్టీ నేతలు మట్టి తవ్వుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.

తాజాగా తనిఖీల్లో ఏకంగా అధికారులను మట్టి మాఫియా బెదిరించింది. ఆర్ఐ అరవింద్ పై దాడి కూడా చేశారు. జేసీబీతో ఆర్ఐని మట్టి మాఫియా బ్యాచ్ నెట్టేసింది. ఈ ఘటనపై రెవెన్యూ సంఘాలు స్పందించాయి. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

అధికారులపై మట్టి మాఫియా దాడులను టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. అధికార పక్ష నేతలు బరితెగించి అధికారులపై దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి పదవి కోల్పోయిన క్యాసినో స్టార్ కొడాలి నాని అనుచరులే ఆర్ఐ అరవింద్ పై దాడులు చేయించారంటూ నారా లోకేష్ ఆరోపించారు. కొడాలి నాని అండతోనే మట్టి మాఫియా రెచ్చిపోతోందని విమర్శించారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల దాడులకు దిగుతుంటే అడ్డుకున్న అధికారుల అంతుచూస్తాం అన్నంతగా రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొడాలి నాని నా విశ్వరూపం చూపిస్తానంటూ ప్రగల్బాలు పలికారని.. విశ్వరూపం చూపించడమంటే అధికారులపై దాడులు చేయించడమా? మంత్రి పదవి కోల్పోయినా ఇలాంటివి బరితెగించి వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

కాగా ఆర్ఐ అరవింద్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు గంట సురేష్ తమ్ముడు గంట కళ్యాణ్ గా పోలీసులు తెలిపారు.