Begin typing your search above and press return to search.

నాన్న చితి మంట ఆరకుండానే గజపతిరాజు చేసిన దారుణాలు మరిచిపోను: సంచయిత

By:  Tupaki Desk   |   8 March 2021 11:30 PM GMT
నాన్న చితి మంట ఆరకుండానే గజపతిరాజు చేసిన దారుణాలు మరిచిపోను: సంచయిత
X
'2016లో మాన్న చనిపోయినప్పుడు ఏం జరిగిందో ఇంకా నాకు గుర్తుంది. వాళ్లకీ గుర్తుంటుంది. ఆ సమయంలో కొంచెం కూడా కనికరం పాటించలేదు. ఏ జన్మలో చేసుకున్న పాపాలు ఆ జన్మలోనే వాళ్లు అనుభవిస్తారు. ' ఇవి మాన్సాస్ ట్రస్ట్, సింమాచలం దేవస్థానం బోర్డు చైర్మన్ సంచయిత గజపతి రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.. గత కొన్ని రోజులుగా ఆమె బాబాయ్ అశోక్ గజపతిరాజు, సంచయితల మధ్య ట్రస్టు వివాదం కొనసాగుతోంది. అయితే ఈ వివాదాలపై ఇటీవల ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా పదవి తీసుకున్న తరువాత అనేక విషయాలను తెలుసుకున్నాను. కొన్ని లోపాలుంటే వాటిని సవరిస్తున్నాను. మాన్సాస్ కు ఉన్న ప్రధాన వనరులు భూములు. అవి రూ.55 వేల కోట్ల విలువతో ఉన్నాయి. ఈ భూములను కారు చౌకగా ఒక్కో ఎకరం రూ.37 చొప్పున లీజుకి ఇచ్చేశారని తెలిసింది. ఆ భూముల్లో పెరిగే ఒక్కో కొబ్బరికాయ ధరే రూ.5 ఉంటుంది. అలాంటిది ఇంత చౌకగా భూములను లీజుకు ఎలా ఇస్తారు..? దీంతో ఆ లీజులన్నీ ఆపేశాను. అందుకే నాపై కక్ష కడుతున్నారు'అని తెలిపారు.

'ఇక మొదట్లో మాన్సాస్ ట్రస్టు ప్రైవేట్ గా ఉండేది. దానిని మా తాతగారు ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ ట్రస్టు ఎండోమెంట్ యాక్ట్ రూల్స్ ప్రకరారమే నడుస్తోంది. అయితే 2019 నాటికి మాన్సాస్ విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి రూ.35 కోట్లు రావాల్సి ఉంది. వాటి కోసం అశోక్ గజపతిరాజు ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. చంద్రబాబు, అశోక్ గజపతి రాజు ఇద్దరు కవలల్లా ఉంటారంటారు కదా..? ఆయన అడిగితే నిధులు ఇవ్వలేరా..?

ఇక మా తాత గారికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి పెళ్లి ద్వారా అశోక్, ఆనంద్, సునీత, రెండో పెళ్లి ద్వారా మరో ముగ్గురు పుట్టారు. ట్రస్టు నిబంధనల ప్రకారం పెద్ద కుమారుడి, పెద్ద సంతానానికే వారసత్వపు హక్కులు వస్తాయి. ఆ విధంగా నేను చైర్ పర్సన్ అయ్యాను. నాకు హక్కు లేదంటే.. వాళ్లకీ హక్కు లేనట్లే..?' అని సంచయిత అశోక్ గజపతి రాజు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.