Begin typing your search above and press return to search.

సమీర్ వాంఖడే మళ్లీ బదిలీ

By:  Tupaki Desk   |   31 May 2022 10:32 AM GMT
సమీర్ వాంఖడే మళ్లీ బదిలీ
X
క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసులో మొండిగా ముందుకెళ్లిన అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఇప్పుడు చర్యలకు రంగం సిద్ధమైంది.ఇప్పటికే ఎన్సీబీ దీనిపై నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసి ఆర్యన్ ఖాన్ ను ఇరికించిన సమీర్ వాంఖడే భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కేసు దర్యాప్తు ప్రారంభంలో నిర్లిప్తంగా వ్యవహరించినందుకు గానూ వాంఖడే పై చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. తాజాగా ఆయనను ముంబై నుంచి చెన్నైకు బదిలీ చేస్తూ ఎన్సీబీ ఆదేశాలు ఇవ్వడం సంచలనమైంది.

ముంబై సమీపంలో క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ వినియోగించాన్న అభియోగంపై షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పై కేసు నమోదు చేసి పోలీస్ కస్టడీకి పంపించారు. ఆ తరువాత బెయిల్ పై బయటికి వచ్చిన ఇన్ని రోజుల తరువాత ఆర్యన్ ఖాన్ కు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వినియోగించలేదని తేలింది.

2021 అక్టోబర్ 2న ముంబైలోని క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ జరిగింది. ఇక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అర్ధరాత్రి దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉన్నట్లు ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. దీంతో ఆయనను కోర్టుకు హాజరుపర్చడంతో 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే దాదాపు 20రోజులు జైలులు ఉన్న తరువాత ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించింది. తాజాగా కోర్టులో క్లీన్ చిట్ కూడా లభించింది.

ఈ క్రమంలోనే వాంఖడేపై అనేక విమర్శలు వస్తున్నాయి. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసేందుకే క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ సహా పలువురిని అరెస్ట్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాక నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొందినట్లు ఎన్సీపీ నేతలు ఆరోపించారు. దీంతో వాంఖడే రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారారు.

ఈ క్రమంలోనే ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ గా వాంఖడే పదవీకాలం ముగియడంతో ఆయనను ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కు బదిలీ చేశారు. ఆర్యన్ ఖాన్ విషయంలో తగిన ఆధారాలు చూపించని కారణంగా సమీర్ వాంఖడే పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సిట్ దర్యాప్తులో పలు అవకతవకలు జరిగాయని తేలింది.

దీంతో కేంద్ర ప్రభుత్వం సమీర్ వాంఖడేపై చర్యలకు దిగింది. ఆయనను చెన్నైలోని డీజీ ట్యాక్స్ పేయర్ సర్వీస్ డైరెక్టరేట్ కు బదిలీ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం వాంఖడేకు గట్టి షాక్ లా పరిణమించింది.