Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ గేదెను దొంగిలించాడట

By:  Tupaki Desk   |   30 Aug 2019 4:57 PM GMT
ఆ ఎంపీ గేదెను దొంగిలించాడట
X
సమాజ్ వాదీ పార్టీ నేత, ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై ఈగ వాలినా సహించలేని నేతగా పేరున్న రాంపూర్ ఎంపీ అజం ఖాన్ పై ఓ విచిత్ర కేసు నమోదైంది. తనదైన శైలి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే అజం ఖాన్... వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. అలాంటి అజం ఖాన్ పై తాజా కేసు నమోదు కావడానికి గల కారణం తెలిస్తే నిజంగానే షాక్ తినక తప్పదు. ఆ కేసుకు కారణం ఏంటంటే... ఓ ఇంటిపై తన అనుచరులతో దాడి చేయడమే కాకుండా అనుచరులతో కలిసి ఆ ఇంటికి చెందిన ఓ గేదెను తస్కరించాడట. బాధితుల ఫిర్యాదు ఆధారంగా అజంఖాన్ తో పాటు ఆయన అనుచరులు 40 మంది పైనా గేదె చోరీకి సంబంధించి కేసు నమోదైంది.

ఉత్తర ప్రదేశ్ లో ఎస్పీ సర్కారు కూలిన తర్వాత అజం ఖాన్ కు వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎస్పీ అధికారంలో ఉండగా మంత్రిగా అజం ఖాన్ తనదైన శైలిలో రెచ్చిపోయిన విషయమూ తెలిసిందే. ప్రత్యర్థుల పై... ప్రత్యేకించి ములాయంపై విమర్శలు చేసే వారిపై వెనువెంటనే విరుచుకుపడే తత్వమున్న అజంఖాన్ పార్టీలో కీలక నేత కిందే లెక్క. మొన్నటి ఎన్నికల్లో తనపై పోటీకి దిగిన రాంపూర్ మాజీ ఎంపీ, తెలుగు నటి జయప్రదపై అసభ్య పదజాలంతో కూడిన కామెంట్లు చేసి సంచలనం రేపారు. ఎన్నికల్లో రాంపూర్ నుంచే జయప్రదను ఓడించిన అజం... ఇప్పుడు అక్కడ ఎంపీగా కొనసాగుతున్నారు. ఎస్పీ అధికారం కోల్పోయాక ఇప్పటికే అజంపై లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాంపూర్‌కు చెందిన అసిఫ్‌, జాకీర్‌ అనే వ్యక్తులు అజం ఖాన్‌పై ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్‌లోని తమ ఇంటిని అజంఖాన్ ధ్వంసం చేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి అనంతరం ఇంటి ఆవరణలో ఉన్న గేదెతో పాటు రూ.25 వేల నగదును సైతం దొంగిలించారని ఆరోపించారు. ఇంటి స్థలాలన్ని ఇవ్వాలంటూ ఎంపీ అనచరులు తమపై దాడిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అజంఖాన్‌ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా గేదెను చోరీ చేశారంటూ అజంతో పాటు ఆయన అనుచరులు మరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచారు. ఈ కేసు చూస్తుంటే అజం ఖాన్ కు ఇకపై చుక్కలు కనిపించడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.