Begin typing your search above and press return to search.

ఓట‌ర్ల కోసం సైకిల్ పార్టీ కొత్త ఎత్తులు

By:  Tupaki Desk   |   15 Feb 2017 4:43 AM GMT
ఓట‌ర్ల కోసం సైకిల్ పార్టీ కొత్త ఎత్తులు
X
ఓటర్లను ఆకట్టుకునేందుకు యూపీలో అధికార‌ సమాజ్‌ వాదీ పార్టీ మిస్డ్ కాల్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ ఎన్నికల్లో చేసిన పనులే చెప్తాయి అనే నినాదంతో ప్రచారం కొనసాగిస్తున్న సమాజ్‌ వాదీ పార్టీ.. తమ మ్యానిఫెస్టోలోని 16 ముఖ్యాంశాలతో నిమిషం వ్యవధి ఉన్న వాయిస్ రికార్డును తయారు చేసింది. దీనిని 60 సెకండ్ల మ్యానిఫెస్టోగా పిలుస్తున్నారు. వారు కేటాయించిన నంబర్‌ కు ఎవరైనా మొబైల్ నుంచి మిస్డ్‌ కాల్ ఇస్తే వెంటనే ఫోన్ వచ్చేలా, నిమిషంపాటు మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలను చెప్పేలా ఏర్పాట్లు చేశారు. ఈ తీరుకు మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని తెలుస్తోంది.

కాగా, ఉత్తరప్రదేశ్‌ లో మొదటి విడుత ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన జాగరణ్.కామ్ అన్‌ లైన్ పత్రిక ఎడిటర్ శేఖర్ త్రిపాఠిని గజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన నేరంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా సంస్థలోని సీనియర్ ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మ‌రోవైపు, ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఉత్తరాఖండ్ - ఉత్తరప్రదేశ్‌ లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరాఖండ్‌ లో 69 స్థానాలకు ఒకేవిడుతలో పోలింగ్ జరుగనుండగా, యూపీలో రెండో విడత పోలింగ్‌ లో భాగంగా 11 జిల్లాల పరిధిలోని 67 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

యూపీ ఎన్నికల్లో 720 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అత్యధికంగా బారాపూర్ నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 2.28 కోట్ల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.04 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వివాదాస్పద మంత్రి ఆజమ్ ఖాన్ - ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజమ్ ఈ విడతలో రాంపూర్ - స్వార్ స్థానాల నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ 11 జిల్లాల్లో ఎస్పీ 34 స్థానాలు - బీఎస్పీ 18 - బీజేపీ 10 - కాంగ్రెస్ మూడు - ఇతరులు రెండుస్థానాలు కైవసం చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌ లో 74.20 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. 13 జిల్లాల పరిధిలో మొత్తం 70 అసెంబ్లీ సీట్లు ఉండగా కర్ణప్రయాగ్ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి కుల్దీప్ సింగ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఇక్కడ పోలింగ్ నిలిపివేశారు. మిగతా 69 స్థానాల్లో 628 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ అధికా రం నిలబెట్టుకునేందుకు శ్రమిస్తుండగా, ఎలాగైనా గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తున్నది. రెండు రాష్ర్టాల్లో పోలింగ్‌ కు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు భద్రతను కట్టుదిట్టం చేశామని అధికారులు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/