Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు ఇచ్చే సీట్ల లెక్క విషయంలో క్లారిటీ

By:  Tupaki Desk   |   15 Jan 2017 10:37 AM GMT
కాంగ్రెస్ కు ఇచ్చే సీట్ల లెక్క విషయంలో క్లారిటీ
X
అంచనాలు నిజమైనట్లే. మొన్నటి వరకూ ఊహాగానాలుగా వినిపించిన విషయాలు ఇప్పుడు వాస్తవరూపం దాలుస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వర్గంతో కాంగ్రెస్ పొత్తును కుదుర్చుకున్నట్లేనని చెప్పాలి. పొత్తు నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. అనధికారికంగా మాత్రం ఇందుకు సంబంధించిన పలు అంశాలపై స్పష్టత వచ్చినట్లుగా చెప్పాలి. ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసేది.. ఏయే నియోజకవర్గాలను కాంగ్రెస్ బరిలో దిగనుంది లాంటి అంశాలపై రాహుల్.. అఖిలేశ్ మధ్య చర్చలు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 100కు పైగా సీట్లు ఇచ్చేందుకు అఖిలేశ్ ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. యూపీలో సొంత బలం అంతంతమాత్రమే అయిన కాంగ్రెస్.. అఖిలేశ్ తో జతకట్టటం ద్వారా యూపీలో బలపడే అవకాశం ఉందని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన రాయబారం యూపీ ముఖ్యమింత్రి అఖిలేశ్ సతీమణి డింపుల్.. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీల మధ్య జరిగిన సంగతి తెలిసిందే.

యూపీలో బీజేపీ విజయానికి చెక్ చెప్పాలంటే తాము సమాజ్ వాదీతో జత కట్టాల్సిన అవసరాన్ని రాహుల్ గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అందుకే.. పొత్తు విషయంలో సానుకూల నిర్ణయం దిశగానే చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే.. యూపీ ఎన్నికల ప్రచారాన్ని ముందే ప్రకటించటం.. తమ పార్టీ సీఎం అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను ప్రకటించింది.

ఇప్పుడదే సమస్యగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. షీలా దీక్షిత్ సైతం అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు.. సమర్థుడన్న కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో షీలాదీక్షిత్ తాను చేయాల్సింది చేస్తానని మాట ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సమాజ్ వాదీ పార్టీ గుర్తు అయిన సైకిల్ ను సొంతం చేసుకోవటం కోసం తండ్రీ.. కొడుకులు ఇద్దరూ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై.. రెండు వర్గాల వాదనను ఎన్నికల సంఘం విన్నది. తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. పార్టీ గుర్తు అయిన సైకిల్ ను ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై ఈసీ అధికారిక సమాచారం వెల్లడించిన వెంటనే.. కాంగ్రెస్ పొత్తు ముచ్చట వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.