Begin typing your search above and press return to search.

జగన్ పాలనతో జాక్ పాట్ కొట్టిన టీడీపీ ఎంపీ..

By:  Tupaki Desk   |   4 March 2020 12:00 AM IST
జగన్ పాలనతో జాక్ పాట్ కొట్టిన టీడీపీ ఎంపీ..
X
అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ పాలనతో రాష్ట్రంలో పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి తోడు అధికార వికేంద్రీకరణతో రాజధాని మార్పు చేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే అవేవి కాదని నిరూపిస్తూ ఏకంగా టీడీపీ ఎంపీకే భారీ లబ్ధి చేకూర్చే పరిణామం జరిగింది. జగన్ పాలన తీరుతో త్వరలోనే ఆ టీడీపీ ఎంపీకి అద్భుత అవకాశం లభించనుంది. దీంతో టీడీపీ నాయకులు నోరు మూసేకునే పరిస్థితి ఏర్పడింది.

గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ పారిశ్రామిక వేత్త కూడా. తన తల్లి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చినా ఆ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయంతో పాటు వ్యాపారంలో ఉంది. ఆ విధంగా రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎంపీగా జయదేవ్ గెలిచారు. జయదేవ్‌కు అమరరాజా బ్యాటరీస్‌ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీతో భారీ ఒప్పందం చేసుకునేందుకు ఓ కంపెనీ మంచి ఆఫర్ తో ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఓ యూనిట్‌ను కూడా నెలకొల్పడానికి ఆసక్తి కనబరుస్తోంది.

తైవాన్‌కు చెందిన సంస్థ సలోమ్.. ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్ల బ్యాటరీల తయారీ చేస్తుంది. యు ఛార్జ్ క్యూ బ్రాండ్‌నేమ్ మీద పవర్ బ్యాంక్స్, బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థ ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్స్, టెలిఫోన్స్‌తో పాటు వాక్యూమ్ క్లీనర్ వంటి పరికరాలకు వినియోగించే రీఛార్జబుల్ బ్యాటరీలను తయారు చేయడానికి అమరరాజా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. మొటొరొలా, ఫిలిప్స్, పానసోనిక్, జియో, సోనీ, లెనొవొ వంటి బడా కంపెనీలు సలోమ్ సంస్థకు క్లయింట్లుగా ఉంటున్నాయి. తమ సంస్థను విస్తరించడానికి ప్రణాళికలు రచించి అన్వేషిస్తున్నారు. ఈ విషయం తెలిసి గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ ప్రతినిధులు ఆ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు చేశారు. సలోమ్‌ యాజమాన్యంతో మాట్లాడి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. దీంతో జయదేవ్ కంపెనీతో కలిసి పని చేసేందుకు ఆ సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.

తొలిదశలోనే ఏకంగా రూ.వంద కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ ముందుకువచ్చింది. ఆ తర్వాత దీన్ని విస్తరించనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగానే సలోమ్ సంస్థ సీఓఓ కిఫ్ వాంగ్, ఆ సంస్థ భారత ప్రతినిధి ఎఎస్ రాజ్‌కుమార్ హైదరాబాద్‌ కు వచ్చారంట. రెండు రోజుల్లో వారిద్దరూ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, తిరుపతిల్లో ఉన్న అమరరాజా సంస్థ యూనిట్లను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. సంస్థకు కావాల్సిన ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్ల బ్యాటరీలను తయారు చేయడానికి ప్రత్యేకంగా అమరరాజా బ్యాటరీ సంస్థ ఓ తయారీ యూనిట్‌ ను నెలకొల్పాల్సి ఉంటుందని ఒప్పందం లో ఉన్నట్లు సమచారం. సలోమ్ సంస్థ అమ్మకాల్లో కనీసం 30 శాతం మే బ్యాటరీలను అమరరాజా యూనిట్ నెలకొల్పబోయే యూనిట్ నుంచే తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు పరిసరాల్లో ఈ యూనిట్‌ను నెలకొల్పబోతున్నారు. ఈ విధంగా టీడీపీ ఎంపీకి కలిసొచ్చింది.

మరి జగన్ పాలన తో పరిశ్రమలు, పెట్టుబడులు పోతున్నాయని విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకులు ఇప్పుడేం సమాధానం చెబుతారని అధికార పార్టీ వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ పాలన తో ప్రతిపక్షాలకు కూడా మేలు జరుగుతున్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.