Begin typing your search above and press return to search.

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంతో ఆంధ్రుల ఆత్మాభిమానం తాకట్టే?

By:  Tupaki Desk   |   4 Feb 2021 1:18 PM GMT
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంతో ఆంధ్రుల ఆత్మాభిమానం తాకట్టే?
X
విశాఖ స్టీల్ ప్లాంట్ ను విక్రయించాలని కేంద్రం నిర్ణయించడం దురదృష్టకరమని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినదించారు. 1971లో కాంగ్రెస్ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని స్థాపిస్తే.. 2021లో బీజేపీ ప్రభుత్వం అమ్మాలని చూస్తోందని తులసీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం పెట్టడం అంటే ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని తులసీ రెడ్డి అన్నారు. లాభాల బాటలో పయనిస్తున్నా స్టీల్ ప్లాంట్ ను అమ్మాలనుకోవడం అవివేకమన్నారు.ఒకవైపు ఆత్మ నిర్భర్ భారత్ అంటూ మరోవైపు దక్షిణ కొరియా కంపెనీకి స్టీల్ ప్లాంట్ ను విక్రయించడం ఏంటని తులసీరెడ్డి ప్రశ్నించారు.

బీజేపీ పాలనలో అడుగడుగునా ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం, అవమానం జరుగుతోందని తులసీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని.. ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నా బీజేపీ పట్టించుకోలేదని తులసీరెడ్డి మండిపడ్డారు.

రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల మేర ఆర్థికసాయం చేయాల్సి ఉండగా.. కేవలం రూ.18వేల కోట్ల మేర మాత్రం లబ్ధి చేకూరిందన్నారు. ఆంధ్రా అనే పేరు లేకుండా ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేశారని కేంద్రాన్ని తులసీరెడ్డి ఆరోపించారు.