Begin typing your search above and press return to search.

జగన్ కు చేటు చేస్తున్న ‘సాక్షి’, ప్రాబ్లమ్ ఎక్కడ?

By:  Tupaki Desk   |   7 Sep 2017 9:37 AM GMT
జగన్ కు చేటు చేస్తున్న ‘సాక్షి’, ప్రాబ్లమ్ ఎక్కడ?
X
సాక్షి మీడియా నిస్సందేహంగా జగన్ ప్రాపర్టీ.. పొలిటికల్ గా సాక్షి స్టాండు గురించి కూడా ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ప్రతి రోజూ మస్టర్ హెడ్ లో వైఎస్ బొమ్మ ఉంటుంది. జగన్ పార్టీ అజెండా మేరకే నడుచుకోవడం సాక్షి అజెండా.. అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. మరి లక్ష్యం స్పష్టం అయినా, అందరికీ తెలిసిందే అయినా.. సాక్షి మీడియా ఇదే అజెండాను అమలు చేయడంలో అట్టర్ ఫ్లాఫ్ అవుతోంది. అసలు సాక్షి పత్రిక జగన్ కు ఉపయోపడటం ఎలా ఉన్నా? నష్టం కూడా చేస్తోందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తోంది. ప్రత్యేకించి సోషల్ మీడియాలో జగన్ అభిమానులే ఈ విషయంలో వాపోతున్నారు. సాక్షి జగన్ కు మేలు చేయడం కాదు - చంద్రబాబుకు మేలు చేసేందుకు గట్టిగా పని చేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒకరిద్దరి అభిప్రాయం కాదు.. సాక్షిలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు.. అని అంటూ ఎడిటోరియల్ టీమ్ లోని కొంతమంది పేర్లను కూడా ప్రస్తావిస్తున్నారు.

ఆ పేర్ల సంగతలా ఉంటే.. జగన్ మీడియా అనుసరిస్తున్న ధోరణి అటూ ఇటూ కాకుండా పోతోంది. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాను గమనిస్తే.. వాళ్లు చాలా క్లారిటీతో ఉంటారు. ఇప్పుడు కాదు... 2004 నుంచి, అంతకు ముందు నుంచి, ఆ పేపర్లు పుట్టినప్పటి నుంచి అవి పిచ్చ క్లారిటీతో ఉంటాయి. తెలుగుదేశం పార్టీపై ఈగవాలకుండా చూసుకోవడం - టీడీపీ వైరి పక్షంపై వీలైనంతగా విరుచుకుపడటం.. అదీ ఆ పత్రికల అజెండా.

తిమ్మిని బమ్మిని చేస్తాయి - పాఠకులను భ్రమల్లో ముంచేస్తాయి - బాబుకు అనుకూలంగా పని చేయడానికి సర్వప్రణాళికలతోనే ఎల్లకాలం రెడీగా ఉంటాయి. ఆ పత్రికలు తెలుగుదేశం అనుకూలం అని దాచేదేమీ లేదు. అయినప్పటికీ.. తమ అజెండాను అవి చక్కగా అమలు చేస్తున్నాయి. మంచి సర్క్యులేషన్ తో దూసుకుపోతున్నాయి. మరి ఒక పొలికల్ పార్టీ కోసం పని చేసే రెండు ప్రధాన పత్రికలు లక్షల సర్క్యులేషన్ తో ముందుకు వెళ్లడం అంటే.. అది అల్లాటప్పా విషయం కాదు. మరి ఆ పత్రికలు ఎక్కడ సక్సెస్ అవుతున్నాయో.. జగన్ మీడియా అక్కడే ఫెయిల్యూర్ అవుతోంది.

సాక్షి పత్రికకు సర్క్యులేషన్ ఉందంటే.. అది కేవలం ప్రత్యామ్నాయ మీడియాగా - వైఎస్ అభిమానవర్గం వల్లనే. తెలుగుదేశం పార్టీ అనుకూల భజనను తట్టుకోలేని తెలుగు ప్రజలు సాక్షి వైపు మళ్లారు. అలాగే.. వైఎస్ అభిమానగణం వల్ల ఎక్కువ ప్రింట్లు సేల్ అవుతున్నాయి. మరి ఈ భావనతో ఈ పత్రికను కొనే వారినే ఆ పత్రిక తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ప్రత్యేకించి.. ఈ పత్రిక చంద్రబాబు కోసం పని చేస్తోంది.. అనే అభిప్రాయం కలుగుతోందంటే.. సాక్షి వల్ల జగన్ కు చేటు జరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

న్యూట్రల్ ఇమేజ్ కావాలని తాపత్రయమో లేక నిజంగానే చంద్రబాబు పై అభిమానమో కానీ..బాబుకు పాజిటివ్ మైలేజీని పెంచడానికి సాక్షి శతథా ప్రయత్నిస్తోంది. ఇటీవల నంద్యాల ఎన్నికల ప్రచారానికి సంబంధించి జగన్ గురించి రోజుకో ఫుల్ పేజీ కవరేజీ ఇచ్చారు. అదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ ప్రచారం విషయానికి వస్తే.. చంద్రబాబు వెళ్లి అక్కడ ప్రచారం చేసినప్పుడు - నంద్యాల ఎన్నికల ప్రచార సమయంలో బాబు వేరే చోట నిర్వహించిన సభలు - చెప్పుకున్న సొంతడబ్బాను.. సాక్షి పతాక శీర్షికల్లో పెట్టింది. జగన్ వార్తను పక్కనకు పడేసి.. చంద్రబాబు వార్తనే హైలెట్ చేసి.. బాబుపై అభిమానాన్ని చాటుకుంది జగన్ పత్రిక!

బాబు ఫొటోను వేస్తే.. ఏదో తెలుగుదేశం పార్టీ అభిమానులు సాక్షిని కొంటారనే భ్రమతో ఉన్నారా? వాళ్లు పైన ఉన్న వైఎస్ బొమ్మను చూస్తారు తప్ప.. సాక్షిలో ఏం రాశారనేదాన్ని వారు పట్టించుకోరు. మరి ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అనుకూల కథనాలు రాసి - బాబును హైలెట్ చేస్తూ.. వైఎస్ అభిమానులను, ఈ పత్రికలో ప్రత్యామ్నాయ వార్తలను చూడవచ్చన పాఠకవర్గాన్ని సాక్షి నిరాశ పరుస్తోంది. ఏ పాఠకులు అయితే ఈ పత్రికకు ప్రధానమో వారినే ఆకట్టుకోలేకపోతోంది సాక్షి.

ఇక మెయిన్ సంగతిలా ఉంటే.. జిల్లా స్థాయి సంగతి సరేసరి. వివిధ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల బానిసల్లా మారిపోయారు సాక్షి రిపోర్టర్లు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు , ఆయా నియోజకవర్గాల్లోని వైకాపా నేతలకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా.. తెలుగుదేశం భజనలో తరిస్తున్నారు జిల్లా రిపోర్టర్లు. జిల్లా ఎడిషన్లలో కవరేజీ కూడా అలాగే ఉంటోంది.

మరి ఇదంతా చూస్తుంటే.. సాక్షి వల్ల జగన్ కు ప్లస్ కాదు - మైనస్సే ఎక్కువ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. కొసమెరుపు ఏమిటంటే..మొన్నటి సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్ వర్ధంతి కదా. ఆ రోజున.. తెలుగుదేశం అనుకూలమైన రెండు ప్రధాన పత్రికలు.. ఆ మాటను మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. నేడు వైఎస్ వర్ధంతి అని ఒక్కమాట అయినా రాయలేదు. కనీసం సమాచారం ఇవ్వడానికి కూడా ఆ పత్రికలు ఇష్టపడలేదు. అంత క్లియర్ గా ఉన్నాయవి. ఇలాంటి పరిస్థితుల నడము జగన్ సొంత పేపర్ మాత్రం.. అనవసరమైన ఆర్భాటాలకు, ఏదో అర్థంలేని వ్యూహాలతో ముందుకు వెళితే..మొదటికే మోసం తెచ్చుకుంటోంది. మరి ఈ పరిస్థితులపై వైకాపా అభిమానులకు అవగాహన కనిపిస్తోంది. వైకాపా అధినేతకు ఈ విషయం తెలుసో తెలీదో!