Begin typing your search above and press return to search.

సుజనా చౌదరి వర్సెస్ 'సాక్షి' - 623 ఎకరాలు!

By:  Tupaki Desk   |   28 Aug 2019 4:47 AM GMT
సుజనా చౌదరి వర్సెస్ సాక్షి - 623 ఎకరాలు!
X
రాజధాని ప్రాంతంలో తనకు సెంటు భూమి లేదంటూ ప్రకటన చేసిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత పత్రిక 'సాక్షి' సంచలన కథనాన్ని ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి - ఆయన కుటుంబీకులు - ఆయన బినామీల పేరిట అక్షరాలా 623 ఎకరాల భూమి ఉందని సాక్షి తన కథనంలో పేర్కొంది. పైగా ఈ వివరాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బయటకు తీసిందని కూడా సాక్షి పేర్కొనడం విశేషం.

రాజధానిని తరలించడానికి వ్యతిరేకమంటూ ఆ ప్రాంతంలో సుజనా చౌదరి పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు చౌదరి. తెలుగుదేశం చిత్తు అయిన తర్వాత ఈయన పార్టీ మారారు. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చలామణీలో ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అజెండానే అమలు చేస్తున్నారనే విశ్లేషణలూ ఈయన విషయంలో ఉన్నారు. ఈ క్రమంలో రాజధాని విషయంలో రాజకీయంలో సుజనా చౌదరి కూడా తలదూర్చారు.

అక్కడకు వెళ్లి తనకు సెంటు భూమి కూడా లేదని ప్రకటన చేశారు. ఇలాంటి నేపథ్యంలో సాక్షి ఈ కథనాన్ని ఇచ్చింది. ఆరు వందల ఇరవై మూడు ఎకరాల భూమి సుజనా చౌదరి బినామీల పేరిట ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఆ భూమి అంతా రాజధాని ఆ ప్రాంతంలో ఏర్పడుతుంది అనే ప్రకటన రాకముందే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని పేర్కొన్నారు. ఎకరా ఐదారు లక్షల రూపాయల ధరతో చాలా భూమిని కొనుగోలు చేశారని - అలాంటి కొనుగోళ్లు అన్నీ అయిన తర్వాతే అక్కడ రాజధాని ప్రకటన చేసినట్టుగా కథనంలో పేర్కొన్నడం విశేషం. సెంటు భూమి లేదన్న సుజనాచౌదరి ప్రకటనపై సాక్షి ఇలాంటి కథనాన్ని ఇచ్చింది. దీనిపై సుజనా చౌదరి ఎలా స్పందిస్తారో!