Begin typing your search above and press return to search.

'సాక్షి' ఆఫీసుకు పట్టని వైఎస్ జయంతి!

By:  Tupaki Desk   |   8 July 2019 6:52 PM IST
సాక్షి ఆఫీసుకు పట్టని వైఎస్ జయంతి!
X
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఎక్కడెక్కడ ఎలా చేసుకున్నారనేది 'సాక్షి' అందరికీ బాగా చూపించింది, చూపిస్తోంది. అటు సాక్షి టీవీ - సాక్షి వెబ్ వర్గాలు దీనిపై బోలెడంత కవరేజీని ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో వైఎస్ అభిమానులు ఆయన జయంతిని ఎలా నిర్వహించారు, ఎలా నివాళులు అర్పించారనే అంశంపై సాక్షి కవరేజీ బాగానే ఉంది. అందులోనూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో వైఎస్ అభిమానులు మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఆనందాన్ని సాక్షి పాఠకులకు - ప్రేక్షకులకు బాగానే చూపించింది. అయితే ఎటొచ్చీ సాక్షి మీడియా ఆఫీసుల్లో మాత్రం వైఎస్ జయంతి సందడి ఏదీ లేదని సమాచారం. ఈ విషయాన్ని సాక్షి ఉద్యోగుల ద్వారానే బయటకు పొక్కింది.

వైఎస్ జయంతి సందర్భంగా సాక్షి మేనేజ్ మెంట్ ఎలాంటి ప్రత్యేక కార్యక్రమమూ నిర్వహించింది లేదని సమాచారం. ఆఫీసుల్లో అందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలనూ అధికారికంగా నిర్వహించలేదట.

ఒకవైపు సాక్షి పత్రిక లోగోలో - టీవీ లోగోలో అనునిత్యం వైఎస్ ఫొటోను వాడుతూ ఉంటారు. జయంతి - వర్ధంతికి ప్రత్యేక సంచికలకూ లోటు లేదు. అయితే ఆఫీసులో మాత్రం చిన్న నివాళి కార్యక్రమం కూడా లేదట.

ఇలాంటివి అన్నీ వైఎస్ జగనో - వైఎస్ భారతీనో ఆదేశించి జరపలేరు. దగ్గరుండి చూసుకోవాల్సిన ఆఫీస్ మేనేజర్లు మాత్రం తమకు సంబంధంలేని వ్యవహారం అన్నట్టుగా ఉండిపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని సాక్షి సిబ్బంది అనుకుంటున్నారట!