Begin typing your search above and press return to search.

చిరు మీద నమ్మకం పోలేదా శైలజానాథ్?

By:  Tupaki Desk   |   30 Jun 2021 5:30 AM GMT
చిరు మీద నమ్మకం పోలేదా శైలజానాథ్?
X
గడిచిన కొంతకాలంగా రాజకీయాలతో లింకు లేకుండా ఉన్న మెగాస్టార్ చిరంజీవి పేరు హటాత్తుగా వార్తల్లోకి రావటం తెలిసిందే. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి.. కొన్నాళ్లకే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రి హోదాలో కులాసాగా కాలం గడిపేసి.. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పేయటం తెలిసిందే. విభజన వేళకు పార్టీలోనే ఉన్న చిరు.. తర్వాత కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయాల పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తూ.. సినిమాలకు ఫుల్ టైం కేటాయించటం షురూ చేశారు.

రాజకీయాల్లోచిరు మాట వినిపించి చాలాకాలమే అయ్యింది. అలాంటివేళ.. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరంటూ ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జీ ఊమెన్ చాందీ వ్యాఖ్యానించారు. దీంతో.. చిరు ప్రస్తావన మళ్లీ మొదలైంది. ఏపీ రాష్ట్ర పార్టీ బాధ్యుడిగా ఉన్న ఆయన వ్యాఖ్యల్ని విభేదిస్తూ.. పార్టీ రాష్ట్ర చీఫ్ సాకే శైలజానాథ్ కీలక వ్యాఖ్య చేయటం ఆసక్తికరంగా మారింది.

చిరంజీవి కాంగ్రెస్ వాదేనని.. తనకు ఇష్టమైన సినీ రంగంలో బిజీగా ఉన్నారని.. అందుకే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొటం లేదని శైలజానాథ్ పేర్కొనటం గమనార్హం. కరోనా వేళ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్పందిస్తున్నారని.. వారికి సేవా కార్యక్రమాల్ని అందిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నట్లు పేర్కొన్నారు. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదని వస్తున్న వార్తలు సరికాదని ఆయన పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో చిరంజీవి క్రియాశీలకంగా వ్యవహరించే వీలుందన్నారు. ఇదంతా చూస్తుంటే.. చిరంజీవికి లేని ఆశల్నిశైలజానాథ్ కే ఉన్నట్లుగా అనిపించకమానదు. రాజకీయాల విషయంలో చిరుకు స్పష్టత ఉందని చెబుతారు. తనకు తాను రాజకీయాల కంటే సినిమాలకు సంబంధించిన అంశాల్లోనే కంఫర్ట్ గా ఉంటాననిచిరు గతంలో చెప్పేవారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి రాజకీయాల ఊసు లేని చిరు మీద శైలాజానాథ్ నమ్మకం పోనట్లుగా ఉంది ఆయన తాజా ప్రకటన చూస్తుంటే. మరి దీనికి చిరు ఎలా రియాక్టు అవుతారో?