Begin typing your search above and press return to search.

రాజధానిపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. జరిగేది చెప్పారా? తొందరపడ్డారా?

By:  Tupaki Desk   |   13 Jan 2021 9:17 AM IST
రాజధానిపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. జరిగేది చెప్పారా? తొందరపడ్డారా?
X
ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతగా వ్యవహరిస్తున్న సజ్జల రామ‌కృష్టారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసిన జగన్ ప్రభుత్వం.. దాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. కోర్టులో ఈ అంశం పెండింగ్ ఉన్న వేళ.. అనూహ్యంగా సజ్జల విశాఖ రాజధాని ప్రస్తావన తేవటం గమనార్హం. అయితే.. ఈ విషయంలో ఆయన కాస్త తొందరపడినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే.. ప్రభుత్వ ప్రాధాన్యతల్ని చెప్పటం తప్పు కాదన్న మాట కొందరు చెబుతున్నారు. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యాల్ని సాపేక్షంగా చూసినప్పుడు.. విశాఖ రాజధాని విషయంలో నెలకొన్న సున్నిత అంశాల్ని ఆధారంగా చూసినప్పుడు ఆయన కాస్త తొందరపడినట్లేనని చెప్పాలి.

మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ‘‘విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు ఖాయం. మరో నాలుగైదు నెలల్లోనే విశాఖకు రాజధానిగా వెళ్లే అవకాశం ఉంది. అప్పటికి కోర్టుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నాం. మూడు రాజధానుల అంశంపై బలంగా వాదనలు వినిపిస్తాం. ఒక నెల అటు ఇటు అయినా.. వెళ్లటం మాత్రం పక్కా’’ అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సజ్జల మాటల్లో తప్పు లేదని చెప్పే వారి మాటేమిటంటే.. ప్రభుత్వ ప్రాధాన్యతల్ని చెప్పటం తప్పేమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే.. జరగాల్సినవి.. జరగాల్సిన రీతిలో జరిగితే సరిపోతుందంటున్నారు. అంతే తప్పించి.. ముందస్తుగా చేసే వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకోవటం.. పొరపాటుగా ప్రచారం చేసి రాజకీయ లబ్థి పొందే వారు ఏపీలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి వ్యాఖ్యల్ని ప్రస్తావించకపోతేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి విషయంలోనూ లోపాలు వెతికే రాజకీయ వాతావరణం ఏపీలో ఎక్కువగా ఉంది. అందుకే.. కీలక విషయాల్ని ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం ప్రకటించాలే కానీ.. సజ్జల లాంటి వారి నోటి నుంచి రావటం విమర్శల్ని సంధించేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. సజ్జల చెప్పిందే జరుగుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే.. ఇప్పుడున్న పరిస్థతుల్లో ఆ అంశాన్నిప్రస్తావించకపోవటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.