Begin typing your search above and press return to search.

ఏలూరు ఫలితంతో పార్టీల బలం చెప్పేయటమా సజ్జల?

By:  Tupaki Desk   |   27 July 2021 4:17 AM GMT
ఏలూరు ఫలితంతో పార్టీల బలం చెప్పేయటమా సజ్జల?
X
రాష్ట్రం ఏదైనా కానీ అధికార పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఎవరైనా కాదనలేని సత్యం. ప్రత్యేక సందర్భంలో తప్పించి.. మామూలుగా అయితే అధికారపార్టీనే అధిక్యతను ప్రదర్శిస్తుంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా ఎన్నికలు జరిగినా.. మరింకేదైనా కారణంతో ఎన్నికలు జరిగితే తుది ఫలితం అధికారపార్టీకి ప్రతికూలంగా రావొచ్చేమో కానీ.. మామూలు పరిస్థితుల్లో అధికార పార్టీకే ఎక్కువగా విజయవకాశాలు ఉంటాయి. ఈ చిన్న విషయాన్ని వదిలేసి.. తాజాగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన ఏపీ అధికారపక్షం.. అక్కడ తమకు వచ్చిన ఓట్ల శాతంతో రాష్ట్ర వ్యాప్తంగా తాము ఎంతలా బలపడ్డామన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయటం ఆసక్తికరంగా మారింది.

తిమ్మిని బమ్మిని చేసేలా మాట్లాడటం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారుల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డికి అలవాటే. తాజాగా ఆయన మాట్లాడిన సందర్భంలో విస్మయానికి గురి చేసే వాదన ఒకటి వినిపించారు. తాజాగా వెల్లడైన ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పార్టీలకు పోలైన ఓట్లను రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులకు నిదర్శనంగా ఆయన చెప్పుకొచ్చారు.

తాజాగా సజ్జల చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. రెండేళ్ల పాలన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 44.73 శాతం ఓట్లు వస్తే.. టీడీపీకి 42.21 శాతం వచ్చాయని చెప్పారు. తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 56.43 శాతం ఓట్లు వస్తే.. టీడీపీకి కేవలం 28.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఇక.. జనసేనకు 2019లో 16,681 ఓట్లు వస్తే.. ఇప్పుడు మాత్రం 7,407ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. ఈ గణాంకాల్ని చూస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని రీతిలో ఉందని వ్యాఖ్యానించారు.

అయితే.. సజ్జల వాదనను పలువురు తప్పు పడుతున్నారు. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలకు.. ఉప ఎన్నికలకు ఏ మాత్రం పోలిక ఉండదన్న మాట రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదే విషయాన్ని ఒక ఉదాహరణతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో నంద్యాల ఉప ఎన్నిక జరగటం.. ఆ ఎన్నికను నాటి అధికారపక్షం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం.. ఏమైనా సరే ఎన్నికల్లో గెలుపు మాత్రం ఖాయం కావాలన్నట్లుగా వ్యవహరించిన ధోరణి నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచేలా చేసింది.

నిజానికి అప్పటికే చంద్రబాబు ప్రభుత్వం మీదా వ్యతిరేకత ఉన్నప్పటికి.. అప్పటి అధికారపక్షం పుణ్యమా అని.. వ్యతిరేకత బయటకు రాకుండా పోవటమే కాదు.. ఘన విజయాన్ని సాధించింది. అంతలా విజయం సాధించిన టీడీపీ.. సార్వత్రిక ఎన్నికల్లో ఎంతలా చతికిలపడిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చివరకు శ్రీశైలం నియోజకవర్గం ఉన్న కర్నూలు జిల్లా మొత్తంలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోకపోవటం గమనార్హం. అందుకే.. ఉప ఎన్నికల ఫలితాలు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒకేలా ఉండవన్నది మర్చిపోకూడదని హితవు పలుకుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీలో లేనిపోని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చి పెడతాయని.. ఇలాంటి వాటితో జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువంటున్నారు. అప్రమత్తత మిస్ అయ్యే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఈ హితవు సజ్జల చెవి వరకు వెళుతుందా?