Begin typing your search above and press return to search.

కుప్పంలో బాబు కథ ముగిసిందా? కీలక వ్యాఖ్యలు చేసిన సజ్జల

By:  Tupaki Desk   |   16 Nov 2021 6:30 AM GMT
కుప్పంలో బాబు కథ ముగిసిందా? కీలక వ్యాఖ్యలు చేసిన సజ్జల
X
రాజకీయం రంగు..రూపు.. రుచి పూర్తిగా మారిపోయాయి. మర్యాదలు మిస్ కాకుండా రాజకీయం చేయటం మొదట్లో ఉండేది. ఆ మాటకు వస్తే.. ఇప్పుడు కలలో కూడా ఊహించని ఉదంతాలు గతంలో ఉండేవి. రాజకీయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవటానికి అధినాయకులు అస్సలు ఇష్టపడేవారు. తమ ప్రత్యర్థులకు సంబంధించి ఘాటు విమర్శలు.. ఆరోపణలు చేసినా అవన్నీ ఒక పరిధి వరకే ఉండేవి. వ్యక్తిగతంలోకి వచ్చేవారు కాదు. కానీ.. 2000 తర్వాత మొదలైన కొత్త కల్చర్ రాజకీయాన్ని గడిచిన ఇరవై ఏళ్లలో ఊహించలేని రీతిలో మార్చేసిందని చెప్పాలి.

ఆ మాటకు వస్తే.. ఇవాల్టి రోజున దేశానికి సరికొత్త రాజకీయాన్ని.. అందులోని వికృతి పార్శాల్ని పరిచయం చేయటంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పాలి. తమిళనాడులో కరుణా నిధి.. జయలలిత ద్వయం మధ్య రాజకీయ పోరు.. ఊహకు అందని ఎన్నో సిత్రాల్ని చూపిస్తే.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది. అందుకు భిన్నంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొందని చెప్పాలి.

ఒకవైపు మాటలు.. మరోవైపు మైండ్ గేమ్.. అన్నింటికి మించిన చేతల్లో చూపిస్తున్న మరో తరహా రాజకీయాలతో రెండు తెలుగు రాష్ట్రాలు తరచూ వేడెక్కిపోతున్నాయి. తాజాగా ఏపీలో జరుగుతున్న స్థానిక ఎన్నికలకు సంబంధించిన పొలిటిక్ హీట్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గతంలో నిర్వహించగా మిగిలిన కొన్ని స్థానాల్లో ఇప్పుడు ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. అందులో విపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నగర పంచాయితీని ఎట్టి పరిస్థుల్లోనూ సొంతం చేసుకోవాలని అధికార వైసీపీ ఆరాటపడుతోంది.

కుప్పంలో ఓటమి ఎదురైతే.. దాని విపరిణామాలు ఏ తీరులో ఉంటాయన్న విషయాన్ని ఇప్పటికే అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు.. ఈ ఎన్నికల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న వైనాన్ని చూసినప్పుడు.. అక్కడ రాజకీయ పోరు ఏ రీతిలో ఉందన్నది ఇట్టే అర్థం కాక మానదు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి రుచి చూపించటం ద్వారా అధినేత మొదలు కార్యకర్త వరకు నోట మాట రాని రీతిలో షాకివ్వాలన్నది వైసీపీ నాయకత్వ ఆలోచనగా చెబుతున్నారు.

మూడు దశాబ్దాలుగా తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే చంద్రబాబుకు.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుందని చెబుతున్నారు. ఇలాంటి వేళ వైసీపీ నేతల మాటలు ఇప్పుడు కొత్త సందేహాలకు తావిచ్చేలా మారాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా.. సీఎం జగన్ మాట్లాడాల్సిన ఏ విషయాన్ని అయినా తాను మాట్లాడే స్వేచ్ఛ ఉన్న ఏకైన వ్యక్తి సజ్జల రామక్రిష్ణారెడ్డి. అలాంటి ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుప్పంలో చంద్రబాబు కథ ముగిసిందంటున్నారు. కుప్పం నగర పంచాయితీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురుకానుందని.. మూడు దశాబ్దాలుగా నిర్మించుకున్నకోట బద్ధలు కానుందని సజ్జల వ్యాఖ్యానించారు. ఇప్పటికే గ్రామ పంచాయితీ.. ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు తీర్పును ఇచ్చారని.. వైసీపీకి విజయాన్ని కట్టబెట్టారన్న ఆయన.. కుప్పంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి.. ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తల్ని రప్పించి దొంగ ఓట్లు వేసుకొని గెలవాలన్న దింపుడు కళ్లం ఆశలతో బాబు ఉన్నారన్నారు.

నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? అంటే లేదనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఏపీలో బలంగా ఉన్న అధికారపక్షం కుప్పంలో బాబు పార్టీని ఓటమి పాలు చేసే విషయంలో పట్టుదలగా ఉన్న వేళలో.. వేర్వేరు ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొస్తుంటే వైసీపీ నేతలు ఊరుకుంటారా? ఉతికి ఆరేయరు? మరి.. అలాంటి వ్యాఖ్యలు సజ్జల నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి? అంటే.. అదో మైండ్ గేమ్ గా అభివర్ణిస్తున్నారు.

కుప్పంలో టీడీపీ ఓటమిని కోరుకుంటున్న అధికారపక్షం.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసిందని.. అయితే.. తాను రంగంలోకి దిగపోతే విషయం తేడా వస్తుందన్నది గ్రహించిన చంద్రబాబు కుప్పంకు రావటం.. తానే స్వయంగా పనుల్ని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. గెలిస్తే.. తాము చెప్పినట్లే కుప్పం కోట బద్దలైందన్న మాటను చెప్పే వీలుంది. అందుకు భిన్నంగా టీడీపీ గెలిస్తే.. బాబు చేసిన అన్యాయాల కారణంగానే గెలిచారన్న మాటను తెర మీదకు తీసుకొచ్చేందుకు వీలుగా ఈ తరహా వాదనను వినిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు.. కుప్పం నగర పంచాయితీ ఎన్నికల విషయంలో ఎదురవుతున్న పరిణామాలు ఆయన జీర్ణించుకోలేనివిగా మారుతున్నట్లుగా చెబుతున్నారు. తుది ఫలితం ఎలా ఉన్నా.. బాబుకు ఈ ఎన్నికలు మర్చిపోలేనివిగా మారటం ఖాయమని చెప్పక తప్పదు.