Begin typing your search above and press return to search.

కొత్త వివాదం.. కుంభమేళాలో సాధువులకేమైంది? రెండుగా చీలారెందుకు?

By:  Tupaki Desk   |   17 April 2021 9:30 AM GMT
కొత్త వివాదం.. కుంభమేళాలో సాధువులకేమైంది? రెండుగా చీలారెందుకు?
X
దేవ భూమి కావొచ్చు.. దేవతలు నడయాడే భూమి కావొచ్చు. ఒక్కసారి కరోనా కబ్జా చేసిందంటే.. అక్కడున్న వారెవరైనా సరే.. దాని బారిన పడి విలవలాలాడాల్సిందే. ఇప్పటికే తన పంజా విసిరి కేరళను అతలాకుతలం చేస్తున్న కరోనా.. తాజాగా మనుషులు చేసిన తప్పుతో దేవభూమిగా పేర్కొనే ఉత్తరాఖండ్ లో తానెంత వినాశనకారి అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నాన్ని షురూ చేసింది. దీనికి కారణం పాలకులు.. భక్తి మూఢంతో కూరుకుపోయిన మనుషులనే చెప్పాలి. కరోనాను పట్టించుకోకుండా మహా కుంభ మేళా పేరుతో నిర్వహిస్తున్న సామూహిక స్నానాలు.. పూజలు ఇప్పుడు తలనొప్పిగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్న దుస్థితి.

కుంభమేళాలో భాగంగా షాహీ స్నానాల సందర్భంగా లక్షలాది సంఖ్యలో వచ్చిన భక్తులు.. వేలాదిగా వచ్చిన సాధువులతో అత్యంత రద్దీగా మారింది. వీరంతా కలిసి గంగానదిలో పుణ్యస్నానాల పేరుతో చేస్తున్న వైనం కరోనాను మహా వేగంగా వ్యాపింపచేసేలా చేస్తోంది. ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 14 నుంచి 28 మధ్య కాలంలో 172 మందిని మాత్రమే పాజిటివ్ గా గుర్తించారు. కట్ చేస్తే.. ఈ నెల ఒకటి నుంచి పదిహేను తారీఖు నాటికి ఆ రాష్ట్రంలో నమోదైన కేసులు ఎన్నో తెలుసా? అక్షరాల రూ.15,333. మేజిక్ నెంబరుగా కనిపిస్తున్న ఈ సంఖ్య ఇప్పుడా రాష్ట్రానికి గుదిబండగా మారింది.

ఫిబ్రవరిలో పోలిస్తే.. ఏప్రిల్ నాటికి పాజిటివ్ కేసుల వృద్ధి రేటు 8814 శాతం పెరిగింది. అంతేకాదు.. కుంభమేళాలో పాల్గొనే సాధువుల్లో అఖాడాకు చెందిన ప్రధాన సాధువు మహామండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ తుదిశ్వాస విడవటం షాకింగ్ గా మారింది. అధికారిక లెక్కల ప్రకారం కుంభమేళా పుణ్యమా అని 49 మంది సాధువులకు కరోనా సోకినట్లుగా తేల్చారు. వాస్తవంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

కుంభమేళాలో షాహీ స్నానాల తర్వాత మహా కుంభ మేళా.. కరోనా సూపర్ స్పైడర్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. రెండు వారాలుగా ప్రతి ఒకటిన్నర నిమిషానికి ఒకరుచొప్పున కరోనా బారిన పడుతున్నారు. దీంతో.. కుంభమేళాను ఇవాల్టి (శనివారం)తో ముగించాలని నిరంజని అఖాడా.. ఆనంద్ ఆఖాడాలు ప్రకటిస్తున్నారు. దీనిపై బైరాగి సాధువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శంకరాచార్యుల శిష్యుడైన స్వామి అవిముక్తేశ్వరానంద ముందుగా ప్రకటించినంత కాలం కుంభమేళా సాగుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. నిరంజని.. ఆనంద్ అఖాడాలకు చెందిన సాధువులు తాము చేసిన ప్రకటనకు సారీ చెప్పాలని నిర్మోహి..నిర్వాణి.. దిగంబర్ అఖాడాలు డిమాండ్ చేయటం గమనార్హం. కుంభమేళాను ముగించే విషయంలో సాధువుల్లో వచ్చిన ఈ చీలిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.