Begin typing your search above and press return to search.

కరోనా టైం లో టోర్నీనా.. భారత బ్యాడ్మింటన్ స్టార్ నిలదీత

By:  Tupaki Desk   |   14 Sept 2020 4:00 PM IST
కరోనా టైం లో టోర్నీనా.. భారత బ్యాడ్మింటన్ స్టార్ నిలదీత
X
కరోనా పరిస్థితుల కారణంగా మార్చి నుంచి క్రికెట్, బ్యాడ్మింటన్ ఆటలు నిలిచిపోయాయి. ఆటగాళ్లందరూ కొన్ని నెలలుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం ప్రారంభించారు. ఈనెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ మొదలవనుండగా ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా ఉండేందుకు నిర్వాహకులు నానా తంటాలు పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇద్దరు ఆటగాళ్లు, పలువురు సిబ్బంది వైరస్ బారిన పడడంతో టోర్నీ నిర్వాహణపై ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిష్ఠాత్మక థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ నిర్వహిస్తుండడం పై భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత ప్రతిష్టాత్మక టోర్నీ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో నిర్వహించడం ఏంటి అని మండి పడ్డారు. సాధారణంగా ఆమె వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. అలాంటి సైనా టోర్నీ నిర్వాహణపై అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకుల తీరును నిరసిస్తూ ట్వీట్ చేశారు.

డెన్మార్క్ లో వచ్చే నెల 3 నుంచి 11వ తేదీ వరకు థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ నిర్వహించనున్నారు. కరోనా ప్రభావం మొదలైన తర్వాత ఎక్కడా బ్యాడ్మింటన్ టోర్నీలు నిర్వహించలేదు. తిరిగి ఈ టోర్నీ ద్వారానే ఆట మొదలు పెట్టనున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ టోర్నీ కోసం ఇప్పటికే మహిళల, పురుషుల జట్లను ప్రకటించింది. ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా ఏర్పాట్లు చేపట్టింది. అయితే కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో టోర్నీ నిర్వహణ సబబు కాదని సైనా విమర్శించారు. ఆటగాళ్లకు ఇది సురక్షితం కాదన్నారు. టోర్నీ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు వైరస్ బారిన పడితే పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. కరోనాకు భయపడే ఏడు దేశాలు టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.