Begin typing your search above and press return to search.

రఘువీరాను ఏకాకిని చేయబోతున్న శైలజానాథ్

By:  Tupaki Desk   |   18 Nov 2015 9:50 AM
రఘువీరాను ఏకాకిని చేయబోతున్న శైలజానాథ్
X
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెసు నేత సాకే శైలజానాథ్ పార్టీ మారబోతున్నారని సమాచారం. మొన్నటి ఎన్నికల నాటికే కాంగ్రెస్ సీను ముగియడంతో ఆయన అప్పట్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నాలూ చేశారు. పనిలో పనిగా వైసీపీ టిక్కెట్ కోసం కూడా ఆయన ప్రయత్నించారు. అయితే... ఆ రెండు పార్టీల నుంచి కూడా టికెట్ రాకపోవడంతో భంగపడిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరపునే శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెసు కార్యకలాపాల్లో పాల్గొంటూ వస్తున్నారు. మొన్నటిమొన్న మట్టి సత్యాగ్రహం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే... ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే మళ్లీ లేచేలా లేదని గుర్తించిన ఆయన పార్టీ మారాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే... టీడీపీ ఆయన పట్ల ఆసక్తి చూపకపోవడంతో వైసీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

శింగనమలలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన యామినీ బాల చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. దీంతో ఆమె స్థానంలో శింగనమల నుంచి శైలజానాథ్ ను అభ్యర్థిగా ఇప్పటి నుంచే గట్టిచేయాలని జగన్ అనుకుంటున్నారని సమాచారం. పైగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శైలజానాథ్ కు పట్టుంది. దీంతో మరికొద్దిరోజుల్లోనే శైలజానాథ్‌ వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే... రఘువీరారెడ్డి వెనుక తిరిగే ఒకరిద్దరు నాయకుల్లోమరొకరు తగ్గినట్లే. ఇప్పటికే రఘువీరా ఏపీలో ఒంటరి పోరాటం చేస్తున్నారు... సొంతజిల్లా నేత కాబట్టి అప్పుడప్పుడు శైలజానాథ్ మాత్రమే ఆయన వెంట కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా వైసీపీలో చేరితో రఘువీరా ఏకాకి అయినట్లే.