Begin typing your search above and press return to search.

ఉద్య‌మ‌కారుడికి విప‌క్ష‌పార్టీ భ‌లే ఆఫ‌రిచ్చిందే

By:  Tupaki Desk   |   12 Nov 2017 5:26 PM GMT
ఉద్య‌మ‌కారుడికి విప‌క్ష‌పార్టీ భ‌లే ఆఫ‌రిచ్చిందే
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాల్లో ఆస‌క్తిక‌ర‌మైన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును త‌న ఉద్య‌మంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాపు రిజ‌ర్వేష‌న్ల స‌మితి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కేంద్రంగా ఈ కొత్త రాజ‌కీయ ప్ర‌తిపాద‌న‌ రూపుదిద్దుకుంది. టార్గెట్ చంద్ర‌బాబు ల‌క్ష్యంగా సాగిన ఈ ప్ర‌తిపాద‌న‌ను చేసింది ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ కావ‌డం విశేషం.

మాజీ మంత్రి - ఏపీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శైల‌జ‌నాథ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి - కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్నారని ఆరోపించిన శైలజానాథ్...రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాటం చేస్తున్న‌ కాపులు, వ‌ర్గీక‌ర‌ణ కోసం ఉద్య‌మిస్తున్న‌ దళితులు కలిసి పోరాటం చేయాల‌న్నారు. ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకోవాల‌ని త‌ద్వారా రాజ్యాధికారం సాధించుకోవాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగానే త‌ద్వారా రెండు కులాల ఆదిపత్యానికి బ్రేక్ వేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు. మాజీ ఎంపీ చింతామోహ‌న్ సైతం ఇదే పిలుపును ఇవ్వ‌డం గమ‌నార్హం.

కాగా, గ‌తంలో ముద్రగడ పద్మనాభం సైతం ఆస‌క్తిక‌రంగా ఇదే ప్ర‌క‌ట‌న చేశారు. అప్రకటిత గృహ నిర్బంధం కొనసాగుతున్న స‌మ‌యంలో 13జిల్లాలకు చెందిన దళిత నాయకులు ముద్రగడను కలిశారు. ఈ సంద‌ర్భంగా వారు ముద్ర‌గ‌డ‌కు త‌మ సంఘీభావం తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా దళితులు - కాపులు కలసి ముందుకుసాగాలని ముద్రగడ పిలుపునిచ్చారు. స‌రిగ్గా అదే ప్ర‌తిపాద‌న కాంగ్రెస్ పార్టీ నుంచి రావ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఇప్పటికే ఏపీలో ప‌లు ప్రధాన పార్టీలు ముద్ర‌గ‌డ‌ను త‌మ పార్టీలోకి రావాల‌ని ప్ర‌తిపాదించాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ముద్ర‌గ‌డ ఏ నిర్ణ‌యం తీసుకోవ‌లేదు. అయిన‌ప్ప‌టికీ...ప్ర‌తిప‌క్ష వైసీపీకి ముద్ర‌గ‌డ మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని అధికార పార్టీ ఆరోపించింది. ఈ క్ర‌మంలో తాజాగా కాంగ్రెస్ ఆహ్వానం ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. కాగా, సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన కాంగ్రెస్ - టీడీపీల త‌ర‌ఫున మంత్రి - ఎంపీ - ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీని నిలుపుకోవాల‌ని ప్ర‌స్తుతం కాపు ఉద్య‌మం కొన‌సాగిస్తున్నారు. తాజా ప్ర‌తిపాద‌న నేప‌థ్యంలో...ముద్ర‌గ‌డ ఏ నిర్ణ‌యం తీసుకుంటారు? ఆయ‌న రాజ‌కీయ రీ ఎంట్రీ 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉంటుందా? అంత‌కుముందేనా అనేది అన్ని వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశ‌మ‌ని అంటున్నారు.