Begin typing your search above and press return to search.

పాపం మాజీ మంత్రిని పట్టించుకోవడం లేదట..

By:  Tupaki Desk   |   11 May 2019 12:44 PM GMT
పాపం మాజీ మంత్రిని పట్టించుకోవడం లేదట..
X
2014 సంవత్సరం.. టీఆర్ ఎస్ బోటాబోటీ మెజార్టీతోనే గద్దెనెక్కింది.కేవలం 62 సీట్లు.. అందులో రెండు మూడు సార్లు గెలిచిన వారు కొందరే.. అందుకే కేసీఆర్ ఉన్నంతలో అనుభవజ్ఞులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఆ కోవలోనే మంత్రిపదవిని చేజిక్కించుకున్నారు జోగు రామన్న. ఏ పదవి లేని టీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నాయిని నర్సింహారెడ్డి ఏకంగా హోం మినిస్టర్ అయ్యారు. ఇలా లక్ లో చాలా మంది మంత్రులయ్యారు.

కానీ 2018 ఎన్నికల్లో మాత్రం టీఆర్ ఎస్ అఖండ మెజార్టీతో గెలవడం.. హేమాహేమీలు గెలవడంతో మంత్రి పదవులకు ఫుల్ డిమాండ్ పోటీ నెలకొంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకు గానీ మంత్రివర్గాన్ని విస్తరించలేదు. మొదటి కొద్దిమందికే మంత్రి పదవులు ఇచ్చారు. ఇంకా చాలా మంది ఆశావహులు క్యూలో ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ లకు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే గడిచిన సారి మంత్రులుగా చేసి ఈసారి పదవులు కోల్పోయిన జోగురామన్న మరోసారి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. పూర్వపు జిల్లా నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో మాజీ మంత్రి అన్న కనీస మర్యాద కూడా జోగురామన్నకు అక్కడ దక్కడం లేదని ఆయన అనుచరులు వాపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర పార్టీ వ్యవహారాల్లో కనీసం జోగురామన్నను పట్టించుకున్న పాపాన పోవడం లేదట..

ఇక నాయిని నర్సింహారెడ్డిని కూడా టీఆర్ ఎస్ మరిచిపోయింది. ఆయన పార్టీలో, ప్రభుత్వంలో డమ్మీగానే మారిపోయారు. ఏ కార్యక్రమంలోనూ యాక్టివ్ గా లేరు. ఇలా పాత మంత్రులు పట్టాభిషేకం లేకపోయేసరికి టీఆర్ ఎస్ లో నామమాత్రపు నేతలుగా మిగిలిపోయారు.