Begin typing your search above and press return to search.

భార్య ఆత్మహత్యను వీడియో తీసిన శాడిస్ట్‌ భర్త!

By:  Tupaki Desk   |   28 Oct 2022 11:44 AM IST
భార్య ఆత్మహత్యను వీడియో తీసిన శాడిస్ట్‌ భర్త!
X
తన భార్య ఆత్మహత్యకు పాల్పడుతుంటే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించకుండా ఆ దృశ్యం మొత్తాన్ని వీడియో తీసి తన శాడిజాన్ని చూపించాడు.. ఓ భర్త. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కలకలం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం.. కాన్పుర్‌లో సంజీవ్‌ గుప్తా, శోభిత గుప్తా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శోభిత గుప్తా తన ఇంటి బెడ్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. మొదటిసారి విఫలమవ్వడంతో మళ్లీ ఉరి పెట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె భర్త సంజీవ్‌ గుప్తా కూడా బెడ్‌ రూమ్‌లోనే ఉన్నాడు. అయితే దీన్ని అడ్డుకోవలసిన ఆమె భర్త అందుకు భిన్నంగా ఆ దృశ్యాన్ని వీడియో తీశాడు. దీంతో ఆమె ఉరికి వేలాడుతూ కన్నుమూసింది.

దీంతో శాడిస్ట్‌ భర్త ఆమె ఉరి వేసుకుని మృతి చెందాక మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చేసరికి ఆమెకు సీపీఆర్‌ చేస్తున్నట్లు శాడిస్ట్‌ భర్త నటిస్తూ ఉండటం గమనార్హం.

ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్ష చేసిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. శోభిత కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించగా వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అతడి ఫోన్‌ను పరిశీలించగా షాకింగ్‌ వీడియో బయటపడింది. తన భార్య ఉరివేసుకుని మృతి చెందడం మొత్తాన్ని శాడిస్ట్‌ భర్త వీడియో తీయడం అందులో నిక్షిప్తమై ఉంది.

భార్యాభర్తలన్న తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, చిన్నచిన్న గొడవలు సహజం. అంతమాత్రం దానికే భార్య ఉరివేసుకుని మరణిస్తుంటే వేడుక చూస్తూ వీడియో తీసిన శాడిస్ట్‌ భర్త సంజీవ్‌ గుప్తాపై విమర్శల వెల్లువ కురుస్తోంది. తన భార్యను వారించాల్సిందిబోయి ఇలా వీడియో తీయడం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు.

కాగా ఇలాంటి ఘటనే గత ఏడాది సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన సంగతి తెలిసిందే. భర్త ఎదుటే ఉరివేసుకుని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దృశ్యాన్ని ఆమె భర్త పెంచలయ్య వీడియో తీశాడు. ఆ తరువాత ఈ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు అరెస్టు చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.