Begin typing your search above and press return to search.

మ‌ద్ద‌తుదారు..పార్టీ అధికార ప్ర‌తినిధిగా ఎలా మారారు?

By:  Tupaki Desk   |   8 Oct 2018 4:53 AM GMT
మ‌ద్ద‌తుదారు..పార్టీ అధికార ప్ర‌తినిధిగా ఎలా మారారు?
X
కార్య‌క‌ర్త‌లు బోలెడంత‌మంది ఉంటారు. ఇక‌.. మ‌ద్ద‌తుదారుల సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. మ‌రి.. ల‌క్ష‌ల్లో ఉండే వారిలో ఎవ‌రైనా ఒక‌రు త‌ళుక్కున మెరిసార‌న్నా.. అధినేత ఆశీస్సులు వారికి సొంత‌మ‌య్యాయంటే అందుకు అదృష్టం ఎంత మాత్రం కార‌ణం కాదు.. టాలెంటే అన్నది ఖాయం.

తాజాగా ఆ విష‌యాన్ని టీడీపీ మ‌హిళా నేత సాధిమినేని యామిని విష‌యంలో మ‌రోసారి రుజువైంది. మొన్న‌టివ‌ర‌కూ ఆమె ఒక టీడీపీకి బ‌ల‌మైన‌ మ‌ద్ద‌తుదారు అంతే. తాను అభిమానించే పార్టీకి సంబంధించి త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపించ‌టం ఆమెకు అల‌వాటు. బాబు పార్టీలో విష‌యాల మీద మాట్లాడే స‌త్తా ఉన్నోళ్లు వేళ్ల మీద లెక్కెట్టే ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. కాస్తంత డొక్క శుద్దితో పాటు.. విష‌యాల మీద అవ‌గాహ‌న ఉన్నోళ్ల అవ‌స‌రం చాలానే ఉంది.

టెక్నాల‌జీ మీద మంచి ప‌ట్టుతో పాటు.. విష‌యాల్ని త‌మ‌కు అనుకూలంగా చెప్పే మాట‌కారి త‌నం.. త‌మ త‌ప్పుల్ని సైతం ఒప్పులుగా తిప్పేసి తెలివి యామిని సొంతం. ఇదే.. ఆమెను బాబు దృష్టికి తీసుకెళ్లేలా చేసింది. బాబు పార్టీలో విష‌యాల మీద అవ‌గాహ‌న ఉన్న మ‌హిళా నేత‌లు త‌క్కువే. ఇలాంటి వేళ‌.. యామిని గురించి బాబుకు తెలియ‌టం.. వెంట‌నే ఆమెను పిలిపించి మాట్లాడి.. ఆమెను పార్టీ అధికార ప్ర‌తినిధిగా ఎంపిక చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

నిన్న‌టి వ‌ర‌కూ ఏ పార్టీకి తాను బ‌ల‌మైన మ‌ద్ద‌తుదారుగా నిలిచిందో.. అదే పార్టీకి తాను అధికార‌ప ప్ర‌తినిధి కావ‌టంపై యామిని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే.. ఇదంతా ఆమె అదృష్టం కంటే కూడా టాలెంట్ అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.. తాను న‌డిచి వ‌చ్చిన దారిని వ‌దిలిపెట్ట‌కుండా ఉంటే రాజ‌కీయాల్లో రాణిస్తార‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. యామిని ఏం చేస్తారో చూడాలి.