Begin typing your search above and press return to search.

సాధ్వి మేడ‌మ్ మీ పేరేమిటి?

By:  Tupaki Desk   |   18 Jun 2019 4:47 AM GMT
సాధ్వి మేడ‌మ్ మీ పేరేమిటి?
X
వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుంటారు కొంద‌రు నేత‌లు. ఆ కోవ‌లోకే వ‌స్తారు బీజేపీ ఎంపీ సాధ్వీ ప్ర‌జ్ఞాసింగ్‌. ఘాటు వ్యాఖ్య‌ల‌తో బాధ్య‌త లేకుండా మాట్లాడే నేత‌గా ఆమెకు పేరుంది. తీవ్ర‌మైన ఆరోప‌ణ‌ల‌తో పాటు.. ఎన్నిక‌ల వేళ‌లో గాంధీ మీద ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోడీ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. గాంధీ మీద ఆమె చేసిన వ్యాఖ్య‌ల్ని త‌న జీవితంలో ఎప్ప‌టికి క్ష‌మించ‌లేన‌ని చెప్పిన ఆమె.. తాజాగా త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ వేళ కొత్త వివాదానికి తెర తీశారు.

తొలిసారి ఎంపీగా గెలిచి లోక్ స‌భ‌లో అడుగు పెట్టిన ఆమె.. తాను ప్ర‌మాణం చేస్తున్న స‌మ‌యంలో త‌న పేరుతో పాటు.. స్వామి పూర్ణ‌చేత‌నానంద్ అవ‌ధేశానంద గిరి అని పలికారు. దీనిపై విప‌క్ష నేత‌లు ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీనికి బ‌దులిచ్చిన ఆమె.. తాను త‌న పేరునే చ‌దువుతున్న‌ట్లుగా చెప్పారు.

దీంతో ఆమెకు అనుకూలంగా బీజేపీ నేత‌లు నినాదాలు చేయ‌టంతో.. ఆమె పూర్తి పేరు ఏమిటంటూ ప్రోటెం స్పీక‌ర్ వీరేంద్ర‌కుమార్ లోక్ స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ను అడిగారు. ఎంపీగా ఆమె గెలిచిన‌ట్లుగా పేర్కొంటూ రిట‌ర్నింగ్ అధికారి జారీ చేసిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రంలో సాధ్వి ప్ర‌జ్ఞాసింగ్ ఠాకూర్ అన్న పేరు ఉంది. దీంతో.. రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రంలో ఉన్న పేరే రికార్డుల్లో ఉంటుందంటూ రూలింగ్ ఇచ్చారు.

త‌న నోటి మాట‌లే కాదు.. చివ‌ర‌కు త‌న పేరు విష‌యంలోనూ వివాదంగా మార్చిన‌ క్రెడిట్ ప్ర‌జ్ఞాసింగ్ ఠాకూర్ కు ద‌క్కుతుంద‌ని చెప్పాలి. నామినేష‌న్ ప్ర‌త్రంలో సాధ్వీ ప్ర‌జ్ఞాసింగ్ ఠాకూర్ ఉన్న‌ప్పుడు.. అస‌లు పేరుగా చెబుతున్న స్వామి పూర్ణచేతనానంద్‌ అవధేశానంద గిరి పేరు ఎక్క‌డి నుంచి వ‌చ్చిన‌ట్లు? ఒక‌వేళ అదే అస‌లు పేరు అయిన‌ప్ప‌డు అలియాస్ అని పేరు రాయించుకోలేదెందుకు? అన్న ప్ర‌శ్న‌ల‌కు సాధ్వీ స‌మాధానం ఇస్తారా?