Begin typing your search above and press return to search.

హిమదాస్ పై సద్గురు ట్వీట్.. దుమారం

By:  Tupaki Desk   |   26 July 2019 5:06 AM GMT
హిమదాస్ పై సద్గురు ట్వీట్.. దుమారం
X
హిమదాస్.. ఇప్పుడు ఈ పేరే దేశంలో సంచలనం. స్ర్పింట్ క్రీడలో వరుసగా ఐదు స్వర్ణ పతకాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్న ఈ క్రీడాకారిణిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. రాష్ట్రపతి - ప్రధాని నుంచి ప్రముఖులంతా ఈమెకు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు.

తాజాగా పోలెండ్ లో జరిగిన పొజన్ అథ్లెటిక్ గ్రాండ్ ప్రీలో హిమదాస్ 200 మీటర్ల రేసులో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత చెక్ రిపబ్లిక్ కుంబో అథ్లెటిక్స్ లోనూ మూడు అథ్లెటిక్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించి ఔరా అనిపించింది. నోవె మెస్టోలో జరిగిన 400 మీటర్ల రేసులోనూ స్వర్ణం సాధించింది. వరుసగా 5 స్వర్ణాలు సాధించిన ఈమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

హిమదాస్ ను ప్రశంసించే క్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురు వాడిన భాష దుమారం రేపింది. ‘హిమదాస్.. ఏ గోల్డెన్ షవర్ ఫర్ ఇండియా.. అభినందనలు.. ఆశీర్వాదాలు’ అంటూ సద్గురు ట్వీట్ చేశారు. ఇప్పుడు వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సద్గురు వాడిన‘గోల్డెన్ షవర్’ అనే పదాన్ని ఓ లైంగిక చర్యలో భాగంగా వాడుతారు. ఆ పదాన్ని వాడడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ట్వీట్ ను తొలగించాలని విమర్శలు సంధిస్తున్నారు.

ఇక కొందరు మాత్రం సద్గురు ‘గోల్డెన్ షవర్’కు అర్థం కనకధార అని.. శంకరాచార్యులు కనకధార స్త్రోత్రం చేసినప్పుడు లక్ష్మీ దేవి ఆయనపై బంగారు పండ్ల వర్షం కురిపించిందని ఆ ఉద్దేశంతోనే సద్గురు ట్వీట్ చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నెటిజన్లు పదాల అర్థాలు తెలుసుకోవాలని కొందరు కౌంటర్ ఇస్తున్నారు.