Begin typing your search above and press return to search.

గేమ్ ప్లాన్? కేసీఆర్ గాలి తీసేసిన కేంద్ర మంత్రి

By:  Tupaki Desk   |   28 Jun 2016 4:34 PM GMT
గేమ్ ప్లాన్? కేసీఆర్ గాలి తీసేసిన కేంద్ర మంత్రి
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానంద గౌడ. ఏపీ హైకోర్టు విభజన.. జడ్జిల నియామకాలకు సంబంధించిన వ్యవహారాలపై జడ్జిలు ఒకపక్క నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఇదే అంశంపై తాను ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఈ రోజు మీడియాలో ప్రముఖంగా కథనాలు ప్రచురించటం తెలిసిందే. కేసీఆర్ నిర్ణయం మీద పలువురు విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఓపక్క కేంద్రంతో సఖ్యంగా ఉంటున్నట్లే ఉన్న ఆయన.. కేంద్రం మీద దండయాత్ర మాదిరి నిరసన చేయటం.. ఆ కార్యక్రమానికి తానే నాయకత్వం వహించటంతో పాటు.. తన ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో సహా భారీ బలప్రదర్శన చేయాలన్నట్లుగా మీడియాలో వచ్చాయి.

దీనిపై కేంద్రమంత్రి సదానంద గౌడ్ ఊహించని రీతిలో విరుచుకుపడటం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. ఎప్పుడూ లేనంత ఆగ్రహ స్వరంతో ఆయన మాటలు ఉన్నట్లుగా చెప్పాలి. హైకోర్టు విభజన విభజన ఇష్యూలో కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించటం సరికాదన్న ఆయన.. విభజన అన్నది రెండు రాష్ట్రాల నిర్ణయంతోనే జరగాలన్నారు.

కేంద్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగదన్న ఆయన.. రాష్ట్రాల నిర్ణయంలో కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసిన సదానందగౌడ.. ‘‘ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లా మారతానంటే ఆయనిష్టం. ఏమీ చేయకున్నా.. ప్రతి రోజూ కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా అలానే చేస్తామంటూ ప్రజలే తగిన జవాబు ఇస్తారు.కేంద్రం మీద ఆరోపణలు చేయటం కాదు.. రాష్ట్ర విభజన చట్టాన్ని చదవాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.

హైకోర్టు విభజన అంశంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పలుమార్లు మాట్లాడినట్లు చెప్పిన సదానంద గౌడ.. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఉదంతంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి.. రెండు రాష్ట్రాల గవర్నర్లకు లేఖ రాస్తామన్నారు.ఉమ్మడి హైకోర్టులో 18 మంది న్యాయమూర్తులు ఏపీకి చెందిన వారు.. ముగ్గురు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారన్న వివరాలతో తాము విభేదించటం లేదన్న ఆయన.. దిగువ కోర్టులకు సంబంధించినంత వరకూ ఏ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలోనే నియమకాలు జరుగుతాయన్నారు. హైకోర్టు విభజన విషయంలో కేంద్రం చొరవ చూపటం లేదని చెప్పటం సరికాదన్న ఆయన.. హైకోర్టు విభజన విషయంలో ఇప్పటికే పిల్ దాఖలైందని.. ఆ పిల్ ను పరిష్కరించినా.. తర్వాత మళ్లీ రివ్యూ పిల్ దాఖలైందన్న ఆయన.. ఇప్పుడది కోర్టు ముందు ఉన్నందున తానేమీ మాట్లాడలేనన్నారు.

ఏమైనా హైకోర్టు విభజన విషయంలో కేంద్రానికి తాను షాకివ్వాలనుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి.. అందుకు భిన్నంగా కేంద్రమంత్రే స్వయంగా రంగంలోకి దిగి.. విమర్శలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటున్న విషయంపై వేచి చూసే ధోరణితో వ్యవహరించే గతానికి భిన్నంగా.. నేరుగా ఢీ అంటే ఢీ అన్నట్లుగా తాజా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. ఎందుకిలా అంటే.. దీనికి కారణం లేకపోలేదు. దూకుడుగా దూసుకొచ్చే కేసీఆర్ ను మాటలతో నిలువరించకపోతే కష్టమన్న విషయాన్ని అర్థం చేసుకున్న కేంద్రం.. సదానంద చేత చెప్పాల్సిన మాటల్ని చెప్పించేసిందని చెప్పాలి.

అవసరమైనప్పుడు తమ పనులు చేయించుకుంటూనే.. అందుకు భిన్నంగా ఎదురుదాడికి దిగుతున్న తీరును చెక్ పెట్టే పనిలో భాగంగానే ఈ వ్యవహారం జరిగిందని చెబుతున్నారు. జడ్జిలు రోడ్ల మీదకు వచ్చి నిరసన చేయటం లాంటి తీవ్ర చర్యల వెనుక కేసీఆర్ అభయహస్తం ఉందన్న సందేహం కూడా ఈ తరహా వ్యాఖ్యలకు కారణంగా చెప్పాలి. ఈ వ్యవహారం మరింత ముదిరితే.. పలు అవాంఛనీయ పరిణామాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని.. అందుకే ఇలాంటి వాటి విషయంలో మొదటే నిర్మోహమాటంగా ఉండటం మంచిదన్న ఉద్దేశంతోనే తాజా ఎదురుదాడిగా చెబుతున్నారు. మరి.. దీనికి కేసీఆర్ కౌంటర్ ఏమిస్తారో..?