Begin typing your search above and press return to search.

ఆ జ‌వాన్ రీ ఎంట్రీ!... మోదీకి ఇబ్బందేన‌బ్బా!

By:  Tupaki Desk   |   30 March 2019 8:44 AM GMT
ఆ జ‌వాన్ రీ ఎంట్రీ!... మోదీకి ఇబ్బందేన‌బ్బా!
X
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు... 2014 ఎన్నిక‌ల మాదిరిగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి అంత ఈజీ ఏమీ కాదు. నాడు గుజ‌రాత్ సీఎంగా ఉన్న మోదీ... ఒక్క‌సారిగా జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి... గుజ‌రాత్ లో తాను చేసిన పాల‌న‌ను చూపి మ‌స్కా కొట్టేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ఐదేళ్లుగా ప్ర‌ధాని హోదాలో మోదీ ఏం చేశార‌న్న‌ది ఇప్పుడు జ‌నం ముందు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక‌లు మోదీకి అంత వీజీ ఏమీ కాద‌న్న వాదన బ‌లంగానే వినిపిస్తోంది. ఇలాంటి త‌రుణంలో మోదీపైకి ఓ స్వతంత్ర అభ్య‌ర్థి దూసుకువ‌స్తున్నారు. ఆ అభ్య‌ర్థి మామూలు అభ్య‌ర్థి ఎంత‌మాత్రం కాద‌నే చెప్పాలి. ఎందుకంటే... దేశాన్ని ఉగ్ర‌వాదులు, శ‌త్రుదేశాల నుంచి కాపాడేందుకు ఓ సైనికుడిగా మారిన ధీరోదాత్తుడు. సైన్యంలో ఉండ‌గానే... మోదీ స‌ర్కారుపై త‌న‌దైన శైలి అస్త్రాలు సంధించిన స‌ద‌రు జ‌వాను... సైన్యం నుంచి దూరం అయిపోయినా.. ఇప్పుడు ఏకంగా మోదీపైకి ప్ర‌త్య‌క్ష ఫైట్ కు సిద్ధ‌మైపోయారు.

ఆ సైనికుడెవ‌రు? ఆయ‌న నేప‌థ్యం ఏమిటి? అన్న వివ‌రాల్లోకి వెళితే... రెండేళ్ల క్రితం దేశ భ‌ద్ర‌త‌ను భుజాల‌కెత్తుకున్న భార‌త సైనికుల‌కు స‌రైన ఆహారం కూడా అంద‌డం లేదంటూ 2017లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించిన బీఎస్‌ ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్ ఏకంగా త‌న వాద‌న‌ను ఓ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి పెను క‌ల‌క‌ల‌మే రేపారు. మోదీ స‌ర్కారును నేరుగానే టార్గెట్ చేసిన యాద‌వ్ వ్యాఖ్య‌లు నాడు దేశ‌వ్యాప్తంగా వైర‌ల్‌ గా మారిపోయాయి. అయితే ఈ వీడియో కార‌ణంగానే బ‌హ‌దూర్ సైన్యం నుంచి స‌స్పెండ్ కాగా... కోర్టును ఆశ్ర‌యించిన బ‌హ‌దూర్ అలుపెర‌గ‌ని పోరు సాగిస్తున్నార‌నే చెప్పాలి. ఆ త‌ర్వాత జ‌నం కూడా ఈ విష‌యాన్ని మ‌రిచిపోయారు. నాడు సైన్యంలో ఉండ‌గానే... మోదీ స‌ర్కారుపై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌నం రేపిన యాద‌వ్‌... ఇప్పుడు మరోమారు రీ ఎంట్రీ ఇచ్చేశారు. న‌రేంద్ర మోదీ పోటీ చేస్తున్న వార‌ణాసి నుంచి మోదీపై పోటీకి దిగుతున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఈ ప్ర‌క‌ట‌న రాగానే చాలా రాజ‌కీయ పార్టీలు ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేందుకు ముందుకు రాగా... ఆయ‌న మాత్రం స్వ‌తంత్ర అభ్య‌ర్థిగానే బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయినా మోదీపైనే ఎందుకు పోటీ చేయాల‌ని అనుకుంటున్నారని అడగ్గా... హరియాణాలోని రేవారి ప్రాంతానికి చెందిన బహదూర్ ఆసక్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పారు. *ఎన్నికల్లో గెలవడం, ఓడటం అనేది కాదు.. భద్రతాబలగాలు ముఖ్యంగా పారామిలిటరీ దళాల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఈ పోటీకి దిగుతున్నా. జవాన్ల పేరు చెప్పి ఓట్లు సంపాదించేందుకు మోదీ యత్నిస్తున్నారు. కానీ ఆ జవాన్ల కోసం ఆయన ప్రభుత్వం ఏమీ చేయలేదు. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోతే కనీసం వారికి అమరుల హోదా కూడా ఇవ్వలేదు* అంటూ బ‌హ‌దూర్ క్లిస్ట‌ర్ క్లియ‌ర్ స‌మాధానాన్నే ఇచ్చారు. మ‌రి బ‌హదూర్ నిజంగానే వార‌ణాసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగితే... మోదీ ఆయ‌న‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.