Begin typing your search above and press return to search.

అసెంబ్లీ బరిలో సీఎంపై మాజీ జవాన్ పోటీ

By:  Tupaki Desk   |   5 Oct 2019 2:01 PM IST
అసెంబ్లీ బరిలో సీఎంపై మాజీ జవాన్ పోటీ
X
దేశ సరిహద్దుల్లో రేయనక పగలనక కాపాలా కాసే సైనికులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని వీడియో తీసి అప్పట్లో సంచలనం సృష్టించాడు భారత సైనికుడు తేజ్ బహదూర్ యాదవ్. దీంతో క్రమశిక్షణ చర్యల కింద సైన్యం 2017లో ఆయనను ఉద్యోగం నుంచి బీఎస్ఎఫ్ తొలగించింది. అయితే తేజ్ బహదూర్ వీడియో మాత్రం సైనికులకు సరైన ఆహారం అందించడం లేదనే విషయాన్ని తెలియజేసింది. దీనిపై పెద్ద దుమారమే రేగింది.

తాజాగా మాజీ జవాన్ గా మారిపోయిన తేజ్ బహదూర్ యాదవ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. జననాయక్ జనతా పార్టీ అభ్యర్థిగా కర్నాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి నామినేషన్ సమర్పించారు.

కర్నాల్ నుంచి స్వయంగా హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీచేస్తుండడం విశేషం. సీఎంపైనే పోటీచేస్తూ తేజ్ బహదూర్ సవాల్ విసురుతున్నారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ తేజ్ బహదూర్ నరేంద్రమోడీపై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా వారణాసి నుంచి నామినేషన్ వేశారు. అయితే ఎన్నికల అధికారులు తేజ్ బహదూర్ నామినేషన్ ను తిరస్కరించారు. బీజేపీ వల్లే తన ఉద్యోగం పోయిందని.. నిరుద్యోగం పెరిగిందని తేజ్ బహదూర్ ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. తాజాగా ఏకంగా సీఎంపైనే పోటీచేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.