Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధ్య‌క్ష రేసులో ఆ ఇద్ద‌రు యువ‌నేత‌లు?

By:  Tupaki Desk   |   7 July 2019 5:16 AM GMT
కాంగ్రెస్ అధ్య‌క్ష రేసులో ఆ ఇద్ద‌రు యువ‌నేత‌లు?
X
సార‌థి అన్నోడు ఎలా ఉండాలి. నిరాశ‌..నిస్పృహ‌లు నిండుగా ఆవ‌రించిన వేళ‌.. త‌న నాయ‌క‌త్వంతో.. పోరాట ప‌టిమ‌తో కొత్త ఆశ‌లు క‌ల్పించి విజ‌యం దిశ‌గా ప‌రుగులు పెట్టించోడు అవ‌స‌రం. అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించేందుకు వీలుగా స‌మ‌ర్థ నిర్ణ‌యాలు తీసుకునే వారి త‌ప్ప‌నిస‌రి. అంతేకానీ.. దిమ్మ తిరిగిపోయేలా ప‌రాజ‌యం ఎదురైన‌ప్పుడు.. నైతిక బాధ్య‌త పేరుతో బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవ‌టం స‌రైన‌దేనా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న రాహుల్.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రాజ‌యం పాలైన త‌ర్వాత త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌టం.. అధికారికంగా కూడా పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవ‌టంతో ఇప్పుడో కొత్త చ‌ర్చ మొద‌లైంది.

రాహుల్ చేసింది మంచా? చెడా? అన్న‌ది ఒక హాట్ టాపిక్ అయితే.. నీర‌సించి.. స‌మ‌ర్థ నాయ‌కుడే క‌నిపించ‌ని కాంగ్రెస్ ప‌గ్గాలు ఎవ‌రికి ద‌క్క‌నున్నాయి? అన్న‌ది మ‌రో ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. ఇలాంటివేళ పంజాబ్ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. యువ‌నేతే కాంగ్రెస్ సార‌థి కావాలి.. రాహుల్ గాంధీ కోరుకుంటున్న‌ది కూడా ఇదేన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

రాహుల్ నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌ట్టి మూలాలున్న.. ప్ర‌జాక‌ర్ష‌ణ ఉండి.. దేశ వ్యాప్త శ్రేణుల‌ను కార్యోన్ముఖం చేసి.. ప్ర‌జ‌ల్లో ఉత్సాహాన్ని నింపే త‌దుప‌రి త‌రం నేత‌ను సార‌థిగా సెలెక్ట్ చేయాల‌ని తాను సీడ‌బ్ల్యూసీని కోరుతున్న‌ట్లుగా పేర్కొన్నారు. జాతి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా పార్టీ విజ‌న్ మార్చేలా నాయ‌క‌త్వం ఉండాల‌న్న ఆకాంక్ష‌ను ఆయ‌న వ్య‌క్తం చేశారు.

పంజాబ్ ముఖ్య‌మంత్రి మాట‌ల ప్ర‌కారం కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష స్థానాన్ని స‌చిన్ పైలెట్ కానీ జ్యోతిరాదిత్య సింధియాల్లో ఎవ‌రో ఒక‌రికి అప్ప‌జెప్పాల‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు నేత‌లు రాహుల్ కు అత్యంత స‌న్నిహితులుగా ఉన్న‌ప్ప‌టికీ.. రేపొద్దున బాధ్య‌త అప్ప‌గించిన త‌ర్వాత ఏకు మైకు అయితే ఎలా? అన్న ప్ర‌శ్న ఇప్పుడు వేధిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సింధియా గుణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడితే.. స‌చిన్ పైలెట్ రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నారు. ఇలాంటివేళ‌.. ఆయ‌న కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌డ‌తారా? అన్న‌ది సందేహం గా మారింది.

ఏమైనా పంజాబ్ ముఖ్య‌మంత్రి ట్వీట్ తో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష స్థానాన్ని యువ‌త‌రానికి అప్ప‌జెప్పాల‌న్న మాట ఇప్పుడు బ‌ల‌మైన పాయింట్ గా మారింద‌ని చెప్పాలి. మ‌రి.. గాంధీ ఫ్యామిలీ ఇందుకు ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఏమైనా కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో ఎవ‌రుండాల‌న్న విష‌యాన్ని సోనియాగాంధీ డిసైడ్ చేస్తార‌న‌టంలో సందేహం లేదు. మ‌రి.. అమ్మ మ‌న‌సులో ఏముందో తెల‌వాలంటే మ‌రికొంత కాలం ఆగాల్సిందేన‌న్న మాట వినిపిస్తోంది.