Begin typing your search above and press return to search.

ఆమె సచిన్ టెండూల్కర్ తో మాట్లాడారేమో: సచిన్ పైలట్ !

By:  Tupaki Desk   |   11 Jun 2021 7:00 PM IST
ఆమె సచిన్ టెండూల్కర్ తో మాట్లాడారేమో: సచిన్ పైలట్ !
X
ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకురాలు రీటా బహుగుణ జోషిపై రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బీజేపీలో చేరడానికి అంగీకరించానని ఆమె చెపుతున్న మాటల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన తెలిపారు. అసలు ఆమెతో తాను మాట్లాడనే లేదని చెప్పారు. సచిన్ తో మాట్లాడానని రీటా బహుగుణ చెపుతున్నారని, బహుశా ఆమె క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో మాట్లాడారేమోనని, తనతో మాట్లాడే ధైర్యం ఆమెకు లేదని స్పష్టం చేశారు.

సచిన్ పైలట్ బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సచ్చిన్ కాంగ్రెస్ లో సరిగా ఇమడలేకపోతున్నారని , బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. ఇదే సమయంలో రీటా బహుగుణ నిన్న ఓ హిందీ మీడియాతో మాట్లాడుతూ, సచిన్ ను కాంగ్రెస్ చులకనగా చూస్తోందని, త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్ తీవ్రంగా ప్రతిస్పందించారు. సచిన్ పైలట్ బీజేపీ గూటికి చేరుపోతారని గతంలోనూ పలుసార్లు పుకార్లు వినిపించాయి. రాజస్థాన్ సీఎం అశ్లోక్ గెహ్లాట్‌ తో విబేధాల కారణంగా ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పట్లోనూ ఆయన, తన మద్ధతుదారులతో కలిసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరిగింది.