Begin typing your search above and press return to search.

సెలక్టర్లుగా సచిన్, ధోనీ, సెహ్వాగ్‌..?

By:  Tupaki Desk   |   24 Dec 2022 12:30 AM GMT
సెలక్టర్లుగా సచిన్, ధోనీ, సెహ్వాగ్‌..?
X
భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పినవారిలో సచిన్ టెండూల్కర్ మూల స్తంభం. మరో ఎత్తుకు తీసుకెళ్లింది వీరేంద్ర సెహ్వాగ్. ఇక విజయ తీరాలకు చేర్చింది మహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పుడు ఈ ముగ్గురూ రిటైరై పోయారు. సచిన్ బీసీసీఐకి అవసరమైన సందర్భంలో సేవలందిస్తున్నాడు. సెహ్వాగ్ టీవీ కామెంట్రీలతో పాటు తనదైన విశ్లేషణ, వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. ధోనీ ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. నిరుడు టి20 ప్రపంచ కప్ లో టీమిండియాకు మెంటార్ గా వ్యవహరించాడు. అయితే, ఈ ముగ్గురూ ఇప్పుడు సెలక్టర్ల రేసులో ఉన్నారు. దరఖాస్తు కూడా చేశారు. ఇటీవలి కాలంలో భారత సెలక్షన్ కమిటీ దారుణ వైఫల్యాల నేపథ్యంలో వేటుకు గురైన సంగతి తెలిసిందే.

అందుకనే సమర్థుల వేటలో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. అందులో భాగంగా సచిన్, సెహ్వాగ్, ధోని దరఖాస్తు చేశారు. వీరి పేర్లతో దరఖాస్తులు వచ్చాయి. వాటిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. నిజంగానే వారు పోటీ పడుతున్నారా? అంటూ నోరెళ్లబెట్టారు.

ఇంతకూ ఏం జరిగింది?అసంబద్ధ నిర్ణయాలతో ఆసియా కప్, టి20 ప్రపంచ కప్ సహా అంతకుముదు ఏడాదిగా టీమిండియా పరాజయాల పాలు కావడంతో బీసీసీఐ ఇటీవల సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. మళ్లీ కొత్త కమిటీ ఎంపికకు దరఖాస్తులు పిలిచింది. దీంతో సీనియర్ జట్టు సెలెక్టర్ల పదవి కోసం ఇటీవల వందలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.వాటిని పరిశీలిస్తుండగా అధికారులు అవాక్కయ్యారు. పై ముగ్గురు దిగ్గజాల పేర్లతో దరఖాస్తులు కన్పించాయి. అయితే, ఇవన్నీ కొందరు ఆకతాయిలు నకిలీ ఈ-మెయిల్‌ ఐడీలతో పంపించినట్లు తేలడంతో ఆశ్చర్యపోయారు.

పోస్టులు 5.. దరఖాస్తులు 600 పైనే టీమిండియా సెలక్టర్ అంటే మామూలుగా ఉండదు. పదవికి పదవి.. హోదాకు హోదా.అలాంటి కమిటీలో ఐదుగురికి చోటుంటుంది. అందుకోసం బీసీసీఐకి 600లకు పైగా ఈ-మెయిల్‌ దరఖాస్తులు వచ్చాయి. వీటిలోనే కొన్ని సచిన్‌, సెహ్వాగ్‌, ధోనీ పేర్లతో ఉన్న స్పామ్‌ ఐడీలతో పంపించారు. అంతేకాదు.. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ పేరుతోనూ దరఖాస్తులు వచ్చాయట. ''బీసీసీఐ సమయాన్ని వృథా చేసేందుకు కొందరు ఇలా ఆకతాయి పనులకు పాల్పడ్డారు'' క్రికెట్‌ మండలి వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అయితే ఐదు పోస్టుల కోసం నుంచి 10 మందిని షార్ట్‌లిస్ట్‌ చేయనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలిపాయి.

వినోద్ కాంబ్లి సెలక్టర్?30 ఏళ్ల కిందట సచిన్ టెండూల్కర్ ను మించి పేరు తెచ్చుకున్న వినోద్ కాంబ్లి సెలక్టర్ పదవికి దరఖాస్తు చేశాడని సమాచారం. సచిన్ బాల్య మిత్రుడైన ఇతడు కెరీర్ ను చేజేతులా నాశనం చేసుకున్నాడు. సచిన్ చేయూత అందించినా.. ఫలితం లేనంతగా కెరీర్ దిగజారిపోయింది. కొన్నాళ్లుగా ఆర్థికంగానూ ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడు సెలక్టర్ అయితే కాంబ్లికి కొంత మేలే.

ఇక మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్ మణీందర్‌ సింగ్‌, మాజీ ఓపెనర్ శివ్‌సుందర్ దాస్‌ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అయితే,పూర్తి వివరాలను బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. టి20 ప్రపంచకప్‌ మెగా సమరం నుంచి టీమ్‌ఇండియా సెమీస్‌ నుంచే నిష్క్రమించిన తర్వాత చేతన్‌ శర్మ నేత్వత్వంలోని సెలెక్షన్‌ కమిటీని బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే.అయితే, కొత్త సెలెక్టర్లను నియమించేంత వరకు ప్రస్తుత ప్యానెలే విధులు కొనసాగించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.