Begin typing your search above and press return to search.

స్వామి స‌న్నిధిలో టెన్ష‌న్ టెన్ష‌న్‌!

By:  Tupaki Desk   |   23 Dec 2018 8:37 AM GMT
స్వామి స‌న్నిధిలో టెన్ష‌న్ టెన్ష‌న్‌!
X
కేర‌ళ‌ల‌లోని ప్ర‌ఖ్యాత శ‌బ‌రిమ‌లలో మ‌ళ్లీ టెన్ష‌న్ మొద‌లైంది. తమిళనాడు నుంచి వచ్చిన 11 మంది మహిళల బృందం ఆలయంలోకి ప్ర‌వేశించేందుకు ఆదివారం ప్ర‌య‌త్నించారు. భ‌క్తులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇరువ‌ర్గాల మ‌ధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

శబరిమల ఆలయంలోకి అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు ప్రవేశించవచ్చునంటూ సుప్రీంకోర్టు ఇటీవ‌ల తీర్పు వెలువరించింది. ఆ తీర్పును అమలు చేసి తీరతామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అప్ప‌టి నుంచి స్వామి స‌న్నిధిలో ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. 10 ఏళ్ల‌కు పైబ‌డిన - 50 ఏళ్ల‌కు లోబ‌డిన మ‌హిళ‌లు ఆల‌యంలోకి ప్ర‌వేశించ‌కుండా స్వామి వారి భ‌క్తులు అడ్డుకుంటుండ‌టంతో ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది.

తాజాగా స్వామి వారి ద‌ర్శ‌నం కోసం తమిళనాడులోని మణితి అనే సంస్థకు చెందిన 11 మంది మ‌హిళా భ‌క్తులు శ‌బ‌రిమ‌ల‌కు విచ్చేశారు. మ‌ణితి సంస్థ మహిళా హక్కుల కోసం పోరాడుతుంటుంది. అయితే- ఆలయానికి వెళ్లే మార్గంలోని మొదటి బేస్‌ క్యాంపు వద్ద వీరిని నిర‌స‌న‌కారులు అడ్డుకున్నారు. దీంతో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా ఉద్రిక్తంగా మారాయి. మణితి సంస్థ నాయకురాలు సెల్వితో పోలీసులు చర్చలు జరిపారు. ఘ‌ర్ష‌ణ‌ను నిలువ‌రించేందుకుగాను వెన‌క్కి వెళ్లాల‌ని కోరారు. అందుకు సెల్వి నిరాక‌రించారు. తాము స్వామి ద‌ర్శ‌నం చేసుకొని తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ప్ర‌స్తుతం శ‌బ‌రిమ‌ల‌లో ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది.

ప్ర‌స్తుతం సెల్వి బృందం మాత్ర‌మే శ‌బ‌రిమ‌ల‌లో ఉంది. అయితే - మ‌రో 40 మంది మ‌హిళ‌లు బృందాలుగా విడిపోయి స్వామి ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నారు. ఇప్ప‌టికే వారు కొట్టాయం, ఎరుమెలి చేరుకున్న‌ట్లు తెలిసింది. మ‌హిళా భ‌క్తుల రాక ముందుగానే తెలియ‌డంతో కేర‌ళ ప్ర‌భుత్వం అక్క‌డ పోలీసుల‌ను భారీగా మోహరించింది. ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని వారికి సూచించింది. పరిస్థితి చేయి దాటకుండా కొండపైకి వెళ్లే బస్సు సర్వీసులను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు.