Begin typing your search above and press return to search.

నవాజ్ సరికొత్త వంటకం అచ్చేయించారు

By:  Tupaki Desk   |   15 Oct 2016 4:19 AM GMT
నవాజ్ సరికొత్త వంటకం అచ్చేయించారు
X
సర్జికల్ దాడుల షాక్ నుంచి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంకా బయటకు వచ్చినట్లుంగా కనిపించటం లేదు. భారత్ చెబుతున్నట్లుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ దాడులు జరగనే.. జరగలేదంటూ తొలుత బుకాయించిన పాక్ కు.. షాక్ మీద షాక్ తగిలాయి. సర్జికల్ దాడులు జరిగిన ప్రాంతానికి చెందిన ఎస్పీనే.. ఆ వ్యవహారం జరిగిందంటూ తేల్చేసిన నేపథ్యంలో మొత్తంగా పరువు పోగొట్టుకుంది. ఏదోలా భారత్ పై మరక వేసి.. సంతృప్తి చెందాలన్న లక్ష్యంతో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం తహతహలాడుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. నవాజ్ షరీఫ్ కు పాక్ మీడియా నుంచి ఊహించని ఇబ్బంది ఎదురైంది. పాక్ ప్రధానికి.. ఆ దేశ ఆర్మీకి మధ్య సఖ్యత చెడిందని.. పాక్ లో తిష్ట వేసుకున్న ఉగ్రవాద ప్రముఖులు మీడియా సమావేశం నిర్వహించినా ఎందుకు పట్టించుకోవటం లేదంటూ ప్రత్యేక కథనాలు వేసిన ‘‘డాన్’’.. ‘‘ది నేషన్’’ మీడియా సంస్థలకు దిమ్మ తిరిగిపోయిన ఆయన.. మీడియా మీద తన పవర్ పంచ్ విసరటం ద్వారా దారికి తెచ్చుకునే పాచిక వేశారు. అయితే.. అదంతా వర్క్ వుట్ కాకపోవటంతో.. తనకు అనుకూలంగా ఉండే మీడియాతో సరికొత్త ప్రచారానికి దిగిన వైనం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి.

భారత్ ఆర్మీ జరిపినట్లుగా చెబుతున్న సర్జికల్ దాడులు అసలు జరగలేదని.. అదంతా బూటకమంటూ భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్.. జర్మన్ రాయబారితో ఆయన అన్నట్లుగా ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే.. ఇదంతా వట్టి అబద్ధమంటూ భారత్ ఖండించింది. సర్జికల్ దాడులు జరగలేదంటూ మొదటి నుంచి చెబుతున్న పాక్ సర్కారు వాదనకు తగ్గట్లుగా.. ‘‘విశ్వసనీయ సమాచారం’’ అంటూ ‘‘ద న్యూస్ ఇంటర్నేషనల్’’ మీడియా సంస్థ తాజా వంటకాన్ని సిద్ధం చేసింది.

తన తాజా కథనంతో పాక్ ప్రభుత్వాన్ని.. ఆర్మీ మనసును దోచుకునేలా వండి వార్చినట్లుగా కనిపిస్తోంది. ఈ నెల 4న బెర్లిన్ లోని పాక్ రాయబారి రుక్సానా అఫ్జల్ జర్మన్ విదేశాంగ మంత్రిత్వ శాఖాధికారులు కారెన్ గోబెల్స్.. జెన్సె వాగ్నెర్.. ఏఎఫ్ పాక్ డివిజన్ సీనియర్ అధికారి సిమోన్ స్టెమ్లెర్ ను కలిసినప్పుడు.. భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ తమతో..సర్జికల్ దాడులు జరగలేదని.. ఆ పేరుతో మోడీ సర్కారు లబ్థి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొంది. కశ్మీర్ లో జరుగుతున్న స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణగదొక్కేందుకు సర్జికల్ దాడుల నాటకానికి తెర తీసినట్లుగా ఈ కథనంలో పేర్కొనటం గమనార్హం. అయితే.. ఈ కథనాన్ని భారత్ ఖండించింది. ఈ కథనం చదువుతున్న వారంతా.. పాక్ ప్రభుత్వ మెప్పును పొందేందుకు సదరు మీడియా సంస్థ ప్రయత్నించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/