Begin typing your search above and press return to search.

నయా నియంత...పుతిన్

By:  Tupaki Desk   |   24 Feb 2022 2:34 PM GMT
నయా నియంత...పుతిన్
X
సామ్రాజ్యవాద కాంక్ష ఎంతటి పని అయినా చేయిస్తుంది. దేశాలను ఆక్రమించమంటుంది. వీలైతే ప్రపంచాన్ని జయించమంటుంది. ఇలాంటి దురూహతోనే అలెగ్జాండర్ ఆనాడు విశ్వ విజేత కావాలని బయల్దేరాడు. చివరికి మూడున్నర పదుల వయసులో ఏమీ కాకుండా చేతులెత్తేశాడు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ మీద యుద్ధంతో వ్లాదిమిర్ పుతిన్ నయా నియంతగా మారాడని నిపుణులు అంటున్నారు. ఆయన ఎవరి మాటా వినే రకం కాదు, ప్రజాస్వామ్య వైఖరి ఏ కోశానా లేదు అన్నది రష్యాలో ఆయన ఏలుబడి చూస్తే అర్ధమవుతుంది. తానే జీవితకాలం ప్రెసిడెంట్ గా ఉండాలని పుతిన్ 2036 వరకూ తన రాజ్యాంగాన్ని సవరించి మరీ పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు.

ఇక ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన పుతిన్ ఇంతటి స్థాయికి రావడం వెనక వెరవని తత్వం ముందుండి నడిపించింది. పుతిన్ వయసు ప్రస్తుతం డెబ్బై ఏళ్ళు. ఆయన అధ్యక్ష పదవీ కాలం మరో పద్నాలుగేళ్ళు ఉంది. ఇక రష్యాలో ప్రజాస్వామ్యం లేదు, విపక్ష నేతల గొంతు నొక్కి తాను అనుకున్నది చేయడమే పుతిన్ వైఖరి అంటారు. పుతిన్ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉన్నా దాన్ని అధిగమించడం ఎలాగో ఆయనకు తెలుసు. వ్యతిరేక గళాల నోరు నొక్కడం కూడా తెలుసు అని చెబుతారు.

ఇక సోవియట్ రష్యా విచ్చిన్నం కావడం అసలు ఇష్టపడని పుతిన్ మళ్ళీ పూర్వ వైభవం కోసం ప్రపంచ పెద్దన్న పాత్ర కోసం తహతహలాడుతున్నారని చెబుతారు. పుతిన్ లో అధికార దాహం ఎక్కువ 1999 నుంచి 2000 వరకూ రష్యాకు ప్రధానిగా పనిచేసిన పుతిన్ 2004 నుంచి 2008 వరకూ రష్యాకు అధ్యక్షుడిగా ఎదిగారు అంటేనే ఆయన కార్యదీక్ష ఎంతటితో అర్ధం చేసుకోవాలి.

ఆ తరువాత పుతిన్ రష్యాకు ప్రధానిగా 2012 దాకా పనిచేశారు. ఇక నాటి నుంచి నేటి దాకా అంటే రెండు తడవుగా ఆయన రష్యా ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఒత్తిడితో అప్పటి ప్రధాని మెద్వెదేవ్‌ రష్యా అధ్యక్ష పదవీ కాలాన్ని ఏకంగా ఆరేళ్ళకు పొడిగించారు. ఇపుడు పుతిన్ ఒక్కరే ఆ పొడిగింపు హక్కులను అనుభవిస్తున్నారు.

రష్యాలో చూసుకుంటే ‘రష్యా కమ్యూనిస్ట్ పార్టీ’ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా పుతిన్ ఆ పార్టీని లొంగదీసుకున్నరని అంటారు. ఆ విధంగా కీలకమైన విషయాల్లో పుతిన్ కి మద్దతు ఇస్తూ ‘రష్యా కమ్యూనిస్ట్ పార్టీ’ తన అస్థిత్వాన్ని కోల్పోతోంది. ఇక మరో వైపు చూస్తే ‘రష్యా ఆఫ్ ద ఫ్యూచర్’ పార్టీకి చెందిన అలెక్సీ నావల్నీ పుతిన్ కి పక్కలో బల్లెం గా మారినా ఆయన మీద కూడా అనేక కేసులు పెట్టి జైలులో ప్రస్తుతం ఉంచారు.

ఇలా రష్యాలో జనాలు పుతిన్ నియంత పోకడల పట్ల వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన మాత్రం ఎక్కడా ఎవరూ నోరు మెదపకుండా చేసుకోగలిగాడని అంటారు. ఇపుడు పుతిన్ కోరిక ఏంటి అంటే ప్రపంచ పెద్దన్న కావాలి. ఆ విధంగా పూర్వం సోవియట్ యూనియన్ లో ఉంటూ విడిపోయిన దేశాలను తిరిగి ఆక్రమించడం. ఆ దిశగానే ఉక్రెయిన్ మీద కక్ష కట్టి మరీ ఈ దాడులు చేస్తున్నారు అని అంటున్నారు.

ఉక్రెయిన్ కి రష్యాలో కలిపేసుకోవడంతో పుతిన్ ఆగరని కూడా అంటున్నారు. పాత సోవియట్ యూనియన్ లో ఉన్న దేశాల మీద ఆ వేట కొన‌సాగిస్తారని, అమెరికాకు పక్కలో బల్లెంగా మారాలని, ప్రపచ పెత్తనం చేయాలని పుతిన్ కోరిక. ఆయనకు చైనా మద్దతు ఉంది. ఇలా బలమైన దేశాలతో అగ్ర రాజ్యాన్ని సవాల్ చేసి తాను ఏదో నాటికి విశ్వ విజేత కావాలన్న పుతిన్ లో అసలైన నియంత ఇపుడు బయట ప్రపంచానికి తెలియాడు అంటున్నారు. మొత్తానికి పుతిన్ వైఖరి వల్ల రష్యా ఏం బావుకుంటుందో, ఫ్యూచర్ లో ఎంతటి మూల్యం చెల్లించుకుంటుందో కాలమే చెప్పాలి.