Begin typing your search above and press return to search.

విడాకులకు అతడు రూ.27.2వేల కోట్లు ఇచ్చాడు

By:  Tupaki Desk   |   23 Oct 2015 6:53 AM GMT
విడాకులకు అతడు రూ.27.2వేల కోట్లు ఇచ్చాడు
X
ఈ శతాబ్దపు అత్యంత ఖరీదైన విడాకుల వ్యవహారం తాజాగా కోర్టు బయట ముగిసింది. ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకరైన రష్యన్ బిజినెస్ మెన్ డిమిత్రీ రిబోలోవ్ లేవ్.. తన భార్యకు విడాకుల కింద దాదాపుగా 5.5 బిలియన్ యూరోలు చెల్లించేందుకు రెఢీ అయ్యాడు.

మన రూపాయిల్లో దీని విలువ సుమారు రూ.27.23 వేల కోట్లుగా చెబుతున్నారు. ఈ విలువను ఏపీ.. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లతో పోలిస్తే దాదాపు 15 నుంచి 17 శాతం మధ్య ఉంటుందని చెప్పొచ్చు. ఈ భారీ ఎత్తున భరణం చెల్లిస్తూ విడాకులకు దిమ్రితీ సిద్ధమయ్యాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ డైవర్స్ ఎపిసోడ్ లో విడాకుల కోసం కోర్టు చుట్టూ వీరిద్దరూ ఎనిమిదేళ్లు తిరగాల్సి వచ్చింది.

భార్యకు విడాకులు ఇవ్వాల్సి రావటంతో.. ఆమెకు నష్టపరిహారం కింద భారీ మొత్తం చెల్లించాల్సి రావటంతో ఇంత పెద్ద కుబేరుడు సైతం తన ఆస్తుల్ని విక్రయించాల్సి వచ్చింది. ప్రపంచంలో అత్యంత ధనికులైన 165 మందిలో దిమ్రితీ 14వ స్థానంలో ఉన్నారు.

30 ఏళ్ల క్రితం విద్యార్థులుగా ఉన్నప్పుడు దిమ్రితీ.. ఎలీనాలు కలుసుకున్నారు. వారి మధ్య స్నేహం ప్రేమగా మారి ఆపై పెళ్లికి వెళ్లి.. దాదాపు రెండున్నర దశాబ్దాలు (23 ఏళ్లు) కలిసి ఉన్న వారు ఇప్పుడు విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితి. భార్యతో విడాకుల కారణంగా తన ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చేందుకు సైతం సిద్ధమయ్యాడు దిమ్రితీ. చిత్రమైన విషయం ఏమిటంటే.. భార్య భర్తల మధ్య తగాదాల నేపథ్యంలో.. భర్తతో విడాకులు కావాలని ఎలీనానే కోర్టులో విడాకుల దావా వేసింది. అయితే.. ఈ కేసు ఎంతకూ తేలకపోవటంతో.. కోర్టు బయట సామరస్యంగా సమస్యను పరిష్కరించుకొని ఎవరికి వారు ఉండాలని డిసైడ్ అయ్యారు.

ఈ ఇద్దరి బంధంలో చాలానే విశేషాలు ఉన్నాయి. వ్యాపారరంగంలో ఎదిగిన తర్వాత తన వ్యాపారి ప్రత్యర్థి హత్య కేసుకు సంబంధించి దిమ్రితీతో పాటు.. ఆయన భార్య ఎలీనా కూడా జైల్లో కాలం గడపాల్సి వచ్చింది. ఇలా కష్టనష్టాల్లో తోడుగా ఉన్న ఇద్దరూ విడిపోవాలనుకోవటం.. ఇందుకోసం ఖరీదైన ఒప్పందంతో విడాకులు తీసుకోవటం ప్రపంచం మొత్తం వీరి గురించి ఆసక్తిగా చర్చించుకొంటోంది.