Begin typing your search above and press return to search.

పెద్ద తప్పు చేసిన రష్యా

By:  Tupaki Desk   |   1 April 2022 6:30 AM GMT
పెద్ద తప్పు చేసిన రష్యా
X
అంతర్జాతీయ స్థాయిలో తాలిబన్లను రష్యా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. చర్చల కోసం ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం పంపిన ప్రతినిధిని తమ ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. దీంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. పోయిన ఆగష్టులో ఆఫ్ఘన్ తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు యావత్ దేశాన్ని కబ్జా చేసేశారు. అప్పటినుండి దేశంలో జరగని అరాచకం లేదు.

ఈ నేపథ్యంలోనే తమను అంతర్జాతీయ సమాజం అధికారికంగా గుర్తించాలని తాలిబన్ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా ఏ దేశం కూడా సానుకూలంగా స్పందించ లేదు. ఒకవైపు ఆఫ్ఘన్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటున్నా ప్రపంచ దేశాలు ఐక్య రాజ్యసమితి ద్వారా సాయం అందిస్తున్నాయే కానీ డైరెక్టుగా తాలిబన్లతో ఏ ప్రభుత్వం కూడా చర్చలు జరపలేదు. ఈ నేపధ్యంలోనే తాలిబన్ ప్రభుత్వాన్ని తాము అధికారికంగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించటం సంచలనంగా మారింది.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా అమెరికా నేతృత్వంలోని ప్రపంచ దేశాలు అనేక నిషేధాలను విధిస్తోంది. తమపై ప్రపంచ దేశాలు ఎన్ని నిషేధాలను విధిస్తున్న రష్యా ఏమాత్రం లెక్కచేయటం లేదు.

ఉక్రెయిన్ పై ప్రత్యక్షంగా యుద్ధం చేస్తునే అమెరికాతో పాటు మిగిలిన దేశాలపై పరోక్షంగా రష్యా యుద్ధం చేస్తోంది. ఈ నేపధ్యంలోనే తాలిబన్లను అధికారికంగా గుర్తిస్తున్నట్లు రష్యా చేసిన ప్రకటన మిగిలిన దేశాలకు మింగుడుపడటం లేదు.

తమపై అమెరికా దాని మిత్రపక్షాలు విధిస్తున్న నిషేధానికి విరుగుడుగానే రష్యా తాజా నిర్ణయం తీసుకున్నట్లుంది. ఏదేమైనా అరాచకానికి మారుపేరైన తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా రష్యా గుర్తించడం అన్నది చాల పెద్ద తప్పు.

అమెరికా, నాటో దేశాలపై మంటతోనే రష్యా ఇపుడీ పనిచేసినట్లు అర్థమైపోతోంది. ఏ దేశంపై రష్యాకు ఎంతమంటున్నా తాలిబన్లకు అధికారికంగా గుర్తించటమంటే పామును పక్కలో పెట్టుకుని పడుకోవటమే. మరిపుడు మిగిలిన దేశాలు ఏమి చేస్తాయో చూడాల్సిందే.