Begin typing your search above and press return to search.

జీవిత‌కాల క‌నిష్ఠానికి ప‌డిన రూపాయి!

By:  Tupaki Desk   |   30 Aug 2018 5:24 AM GMT
జీవిత‌కాల క‌నిష్ఠానికి ప‌డిన రూపాయి!
X
ఆరేళ్ల‌లో రూపాయి ఎంత‌గా చిక్కిందో తెలిస్తే అవాక్కే!

రూపాయి చిక్కిపోతోంది. అంత‌కంత‌కూ విలువ త‌గ్గిపోతూ ఆందోళ‌న క‌లిగిస్తోంది. త‌న జీవిత కాలంలోనే అత్యంత క‌నిష్ఠ స్థాయికి రూపాయి తాజాగా చేరుకుంది. మొన్న‌టికి మొన్న డాల‌ర్ మార‌కంతో 70 రూపాయిల‌కు చేరుకున్న రూపాయి... తాజాగా మ‌రో 49 పైస‌ల న‌ష్టానికి గురై.. ఏకంగా రూ.70.59గా ప‌డిపోయింది.

ఎప్ప‌టిమాదిరే.. రూపాయి ఇంత‌గా ప‌డిపోవ‌టానికి కార‌ణం ఏమిటంటే.. క‌రెంటు ఖాతాలో పెరిగిన లోటు.. బ్యాంక‌ర్ల నుంచి డాల‌ర్ల‌కు పెరిగిన డిమాండ్ గా చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. మ‌రో రోజులో (శుక్ర‌వారం) వెలువ‌డే జీడీపీ.. ద్ర‌వ్య‌లోటు నివేదిక త‌ర్వాత మ‌రెలాంటి ప‌రిస్థితి ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆందోళ‌న‌గా మారింది.

షాకింగ్ అంశం ఏమంటే.. కేవ‌లం ఆరేళ్ల వ్య‌వ‌ధిలో డాల‌రుతో రూపాయి మార‌కం విలువ ఎంత దారుణంగా ప‌డిపోయిందో తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. రోజుకు రెండు మూడు పైస‌లు.. అప్పుడ‌ప్పుడు పది.. ప‌దిహేను పైస‌లు చొప్పున త‌గ్గుకుంటూ పోతున్న రూపాయి.. ఆరేళ్ల వ్య‌వ‌ధిలో ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా 20రూపాయిలు త‌గ్గిపోవ‌టం గ‌మ‌నార్హం.

వాజ్ పేయ్ హ‌యాంలో డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ యాభైకి ద‌గ్గ‌ర‌గా వ‌స్తుంటే హాహాకారాలు చేసిన దుస్థితి. ఆత‌ర్వాత ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌న్మోహ‌న్ కాలంలోనూ రూపాయికి బ‌లం చేకూర‌కున్నా.. ఇంత భారీ ఎత్తున బ‌క్కచిక్క‌లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

జీవిత కాలం క‌నిష్ఠానికి రూపాయి చేర‌టానికి ప‌లు కార‌ణాలను చూపిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. వారు చూపిస్తున్న అంశాల్ని చూస్తే..

1. ఎగుమ‌తుల‌కు మించి పెరిగిన దిగుమ‌తుల భారం.
2. అంత‌ర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు
3. అమెరికాలో వ‌డ్డీ రేట్లు పెరిగే కొద్దీ ఎఫ్ పిఐలు భార‌త రుణ ఈక్విటీ మార్కెట్లో ఉన్న త‌మ పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకోవ‌టం
4. క‌రెంటు ఖాతా లోటులో పెరుగుతున్న వైనం
5. దేశానికి వ‌చ్చే డాల‌ర్ల కంటే దేశం నుంచి త‌ర‌లిపోతున్న డాల‌ర్లు ఎక్కువైపోవ‌టం.

ఆందోళ‌న క‌లిగించే అంశం ఏమంటే.. డాల‌రుతో రూపాయి మార‌కం విలువ‌ను రూ.70 ద‌గ్గ‌ర ఉంచేందుకు ఆర్ బీఐ ఇప్ప‌టివ‌ర‌కూ త‌న ద‌గ్గ‌ర ఉన్న డాల‌ర్ల నిల్వ‌లోనుంచి 2,300 కోట్ల డాల‌ర్ల‌ను అమ్మేసింది. అయినా.. రూపాయి విలువ త‌గ్గ‌కుండా నిలువ‌రించ‌లేక‌పోతోంది.ఆర్ బీఐ తాజా చ‌ర్య‌తో ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న 43 వేల కోట్ల డాల‌ర్లు కాస్తా 40వేల కోట్ల‌కు త‌గ్గాయి. వ్ర‌తం చెడ్డా ఫ‌లితం ద‌క్క‌లేద‌న్న చందంగా.. ఇంత భారీగా డాల‌ర్లు అమ్మేసినా.. రూపాయి విలువ ప‌డిపోకుండా మాత్రం ఆప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

డాల‌రుతో రూపాయి మార‌కం విలువ బాగా ప్ర‌భావిత‌మైన కాలాన్ని చూస్తే.. 2012-14 మ‌ధ్య కాలంలో 50.56 నుంచి 68.36కు త‌గ్గిపోయింది. ఆ త‌ర్వాత నుంచి డాల‌రుతో రూపాయి విలువ మ‌రింత ప‌డిపోకుండా ఉండేందుకు కిందామీదా ప‌డినా.. ఆ ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ‌లేదు. ఫ‌లితంగా తాజాగా రూ.70.59 వ‌ద్ద‌కు రూపాయి విలువ ప‌డిపోయింది. గ‌డిచిన ఎనిమిది నెల‌ల్లో దాదాపు ఏడు రూపాయిల చిల్ల‌ర వ‌ర‌కూ డాల‌రుతో రూపాయి మార‌కం విలువ ప‌డిపోవ‌టం గ‌మ‌నార్హం.