Begin typing your search above and press return to search.

అమెరికా డాలర్ తో రూపాయి విలువ భారీ పతనం.. మరింత దిగజారడం ఖాయం?

By:  Tupaki Desk   |   10 Jun 2022 12:30 PM GMT
అమెరికా డాలర్ తో రూపాయి విలువ భారీ పతనం.. మరింత దిగజారడం ఖాయం?
X
బీజేపీ పాలనలో దేనికి నియంత్రణ లేకుండా పోతోంది. రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధర కొండెక్కి కూర్చుంది. నిత్యావసరాలు మండిపోతున్నాయి. తాజాగా రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థనే కృంగదీస్తోంది.అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతోంది. ఈ పతనం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికా డాలర్ కు డిమాండ్ పెరిగిపోవడంతో దేశీయ రూపాయి భారీగా క్షీణిస్తోంది. మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా రూ.77.87 మార్క్ కు చేరడం సంచలనమైంది.

డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనం అవుతోంది. కొత్త కనిష్టానికి చేరుకుంది. ఇది మరింత క్షీణించే అవకాశం ఉంది. మన రూపాయి పతనంతో ద్రవ్యోల్బణ ప్రమాదాలు పొంచిఉన్నాయి. సుదీర్ఘమైన ఆర్థికమాంద్యం తర్వాత భారత రూపాయి శుక్రవారం నాడు అమెరికా డాలర్‌కు రూ. 77.87 వద్ద కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పట్లో ఇదే భారీ పతనంగా చెప్పొచ్చు. దీన్ని రికార్డుగా అభివర్ణిస్తున్నారు.

సరఫరాలో అంతరాయం కారణంగా ముడిచమురు ధరలు మూడు నెలల గరిష్ట స్థాయికి పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరియు కరెన్సీ విలువపై నష్టాన్ని కలిగిస్తోందని రెలిగేర్ బ్రోకింగ్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సుగంధ సచ్‌దేవా అన్నారు.

అంతేకాకుండా ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ వృద్ధి అంచనాను జనవరిలో 4.1 శాతంగా అంచనా వేయగా 2.9 శాతానికి తగ్గించడం కూడా కరెన్సీ విలువను తగ్గించిందని సచ్‌దేవా చెప్పారు.

మున్ముందు రూపాయి విలువ సమీప కాలంలో రూ. 78.20 మార్కుకు.. మరింత దిగజారితే రూ. 78.50కి క్షీణించవచ్చని అంచనా.

తాజా అంచనాల ప్రకారం.. అమెరికాలో ద్రవ్యోల్బణం డేటా రూపాయి పతనానికి కీలక సూచికగా ఉంటుంది.

ఇక దేశీయంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి వేయడం కోసం వడ్డీ రేట్లను పెంచింది. ఈ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ సడెన్ గా వడ్డీ రేట్లను పెంచడంతో బ్యాంకులు వడ్డీరేట్లను పెంచి వినియోగదారులపై వేశారు.. అయితే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను పెంచుతుండడంతో దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఫండ్స్ తరలిపోతున్నాయి. దీంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగి మన రూపాయి విలువ పతనం అవుతోంది.