Begin typing your search above and press return to search.

మౌన ప్రధానికి.. మాటల ప్రధానికి మధ్య తేడా చెప్పేసిన రూ'పాయె'!

By:  Tupaki Desk   |   21 July 2022 2:30 PM GMT
మౌన ప్రధానికి.. మాటల ప్రధానికి మధ్య తేడా చెప్పేసిన రూపాయె!
X
ఎలాంటి జానాకర్షణ శక్తి లేకుండా దేశాన్ని పదేళ్ల పాటు పాలించటం ఒక్క మన్మోహన్ సింగ్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో? ఆ మాటకు వస్తే.. ఆ విషయంలో సోనియా గాంధీని కూడా మెచ్చుకోవాల్సిందే. తన అత్త ఇందిరమ్మ మాదిరి కాకుండా.. తనదైన శైలిలో సోనియమ్మ వ్యవహరించిన తీరును ఇప్పుడు చాలామందిని గుర్తిస్తారు. కొందరు చేసిన త్యాగాలు అంత త్వరగా అర్థం కావు. కాలం ఇలాంటి వాటిని బాగా అర్థమయ్యేలా చేస్తుంది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. మరెన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా.. కొడుక్కి పట్టాభిషేకం చేయటానికి పాకులాడే కన్నా.. ప్రభుత్వ రథాన్ని సాఫీగా నడిపించేందుకు సోనియా చేసిన ప్రయత్నాల్ని మెచ్చుకొని తీరాల్సిందే.

ప్రధానమంత్రిగా మన్మోహన్ కుర్చీలో కూర్చున్నప్పటికీ.. రిమోట్ మొత్తం సోనియా అన్న విషయం అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే. అయినప్పటికీ తన హద్దులు దాటకుండా జాగ్రత్తలు తీసుకున్న వైనంపై అప్పట్లో సానుకూలత లేనప్పటికీ.. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఆయన వ్యవహరిస్తున్న తీరును చూసిన తర్వాత సోనియా - మన్మోహన్ కాంబినేషన్ మీద ఇప్పుడు అందరిలోనూ ఒకలాంటి గౌరవ ప్రదమైన భావన కలుగుతుందని చెప్పాలి.

అవినీతి విషయంలో మన్మోహన్ సర్కారులో కొంత మేర తప్పులు జరిగి ఉండొచ్చు. ఆ మాటకు వస్తే.. అందులో ఆయన్ను తప్ప పట్టే కన్నా.. అప్పటి పరిస్థితులు అలా ఉండేవని చెప్పాలి. ఇక.. దేశ ఆర్థిక పరిస్థితి విషయంలో మన్మోహన్ తీరుపై పెదవి విరుపు కనిపించేది. కానీ.. మోడీ సర్కారు రెండో దఫా అధికారాన్ని చేపట్టి.. పన్నుల భారాన్ని అంతకంతకూ పెంచేస్తున్న వేళ.. మాట్లాడకుండా మౌనంగా ఉండే ప్రధాని హయాంలోనే పరిస్థితులు కొంత బాగున్నాయన్న భావన కలిగే పరిస్థితి.

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. డాలర్ తో రూపాయి మారకం విలువపై ఇప్పుడు హాహాకారాలు చేస్తున్న పరిస్థితి. అకాశమే హద్దుగా డాలర్ చెలరేగిపోతుంటే.. పాతాళమే లెక్కగా రూపాయి విలువ అంతకంతకూ తగ్గిపోతున్న వైనాన్ని చూస్తున్న వారికి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మన్మోహన్ ను అందరూ మౌన ప్రధానిగా వ్యంగ్యస్త్రాల్ని సంధించేవారు. అదే సమయంలో అప్పట్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ మాటల్నివినప్పుడు.. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. ఏదైనా జరిగినప్పుడు నేను ఉన్నాన్నట్లుగా రియాక్టు అవుతారన్న భావన ఉండేది.

ఇవాల్టి రోజున చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో డాలర్ తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది. ఇలాంటి వేళలో..మాట్లాడే ప్రధాని కుర్చీలో ఉన్నా.. ఆయన ఈ విషయాల మీద మాత్రం మౌన ప్రధానికి మించినట్లుగా వ్యవహరిస్తున్నారు. మన్మోహన్ 2004లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకొని 2014 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఆ సమయంలో డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.49.8 నుంచి రూ.61 వరకు ఉంది. అంటే.. ఆయన పదేళ్ల పదవీ కాలంలో రూపాయి విలువ దగ్గర దగ్గర రూ.11.2 పడిపోయింది.

ఇక.. మోడీ హయాంలోకి వస్తే ఆయన పవర్ లోకి వచ్చే నాటికి డాలర్ తో రూపాయి మారకం విలువ దగ్గర దగ్గర రూ.61 వరకు ఉండేది. తాజాగా రూ.80.5 వరకు వెళ్లింది. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది. నిపుణుల అంచనా ప్రకారం డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85వరకు వెళ్లిపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అంటే.. మోడీ పదేళ్ల కాలంలో డాలర్ పోల్చినప్పుడు ఏకంగా రూ.24 వరకు కరిగిపోయే దుస్థితి.

ఇప్పటివరకు చూసుకున్నా.. మోడీ ప్రధాని కుర్చీలో కూర్చున్న నాటికి.. తాజా ధరకు తేడా ఏకంగా రూ.19.5 వరకు తగ్గిపోయింది. గతంలో ఏ ప్రధానమంత్రి ఉన్న వేళలో ఇంత భారీగా పడిపోయిన పరిస్థితి లేదంటున్నారు. మౌన ప్రధానికి.. మాటల ప్రధానికి మధ్యనున్న తేడా రూ'పాయె' అన్నది నూటికి నూరుపాళ్లు జరిగిందని చెప్పక తప్పదు.