Begin typing your search above and press return to search.

రూపాయి చిక్కుదల...బంగ్లా కరెన్సీని దాటిపోతుందా?

By:  Tupaki Desk   |   27 Aug 2019 3:58 PM GMT
రూపాయి చిక్కుదల...బంగ్లా కరెన్సీని దాటిపోతుందా?
X
భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నపళంగా అగాథంలో పడిపోతున్నట్లుగా వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దేశంలో అభివృద్ధి మందగించిందని, మాంద్యం ఛాయలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయని వారం రోజులుగా వినిపిస్తున్న వార్తలు నిజంగానే తీవ్ర ఆందోళనను కలిగించేవే. సమీప భవిష్యత్తులోనే భారత్.. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించనుందని, త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని నరేంద్ర మోదీ సర్కారు ఇటీవలి బడ్జెట్ సందర్భంగా చాలా ఘనంగానే ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్... ఇంత ఘనంగా ప్రకటించిన నెల రోజుల్లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశగా పయనిస్తోందన్న వార్తలు నిజంగానే ఆందోళన రేకెత్తించేవే.

ఈ వార్తలు, ఆ వార్తల ద్వారా కలుగుతున్న ఆందోళన నిజమేనన్నట్లుగా మన రూపాయి విలువ క్రమంగా తగ్గిపోతోంది. అమెరికా డాలర్ తో పోలిస్తే... ప్రస్తుతం రూపాయి విలువ 71.49గా ఉంది. గడచిన కొంతకాలంగా క్రమంగా రూపాయి విలువ తగ్గుతూ వస్తున్న క్రమంలో రూపాయి మరింత క్షీణించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... మన పొరుగు దేశం బంగ్లాదేశ్ కరెన్సీ టాకా కంటే కూడా రూపాయి విలువ దిగజారిపోతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే టాకా విలువ 84.49గా ఉంది.

అంతేకాకుండా... ప్రస్తుతం రూపాయి మారకం విలువ క్రమంగా తగ్గిపోతూ ఉంటే... టాకా విలువ మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే... రూపాయి విలువ టాకా కంటే కూడా దిగజారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదన వినిపిస్తోంది. ఐదు మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతోందంటూ భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ సర్కారు ఓ వైపు గొప్పలు చెబుతూ ఉంటే... మరోవైపు మాత్రం రూపాయి విలువ టాకా కంటే కూడా దిగజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. మొత్తంగా దేశంలో మాంద్యం ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోందంటూ వస్తున్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తుంటే... రూపాయి విలువ బంగ్లాదేశ్ కరెన్సీ కంటే దిగజారిపోతోందన్న వాదనలు సరికొత్త ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.