Begin typing your search above and press return to search.

తమిళనాడులో యముడి పుకారుతో హడావుడి

By:  Tupaki Desk   |   10 Dec 2015 7:51 AM GMT
తమిళనాడులో యముడి పుకారుతో హడావుడి
X
భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో సరికొత్త పుకారు ఒకటి షికారు చేస్తోంది. ఎలా మొదలైందో ఎవరూ చెప్పలేకపోతున్నారు కానీ.. ఒక పుకారు విస్తృతం వ్యాప్తిస్తోంది. యముడు దున్నపోతు మీద వచ్చి.. ఇంటి యజమాని ప్రాణాల్ని ఎత్తుకెళ్లిపోతున్నాడని..అలాంటివి అశుభాలు జరగకుండా ఉండాలంటే ప్రత్యేక పూజలు చేయాలంటూ చెబుతున్న మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో వణికిపోతున్న వారు.. తాజా పుకారుకు మరింత బెంబేలెత్తిపోతున్నారు.

తమకు వినిపిస్తున్న పుకారులో నిజం ఎంత? అదసలు సాధ్యమేనా? దున్నపోతు మీద వచ్చిన యముడు ఎవరికైనా కనిపించాడా? అలా వచ్చిన యముడు ఎవరి ప్రాణాలు తీసుకెళ్లాడు? వారు ఎక్కడి వారు? ఇలాంటి ప్రశ్నల్ని వదిలేసి.. పుకారును నమ్మేసి.. దానికి విరుగుడుగా చెప్పిన పనులు చేస్తూ హడావుడి పడటం పెరిగిపోయింది.

దున్నపోతు మీద వచ్చే యముడిని తప్పించుకునేందుకు.. ఉదయాన్నే నిద్ర లేని.. ఇంటి ముందు చక్కటి ముగ్గు వేసి.. ప్రత్యేకంగా దీపాలు పెడుతూ.. ఇంటి పెద్ద (భర్త)ను తీసుకొని అంజనేయస్వామి గుడికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయిస్తే.. భర్తకు ఎలాంటి ముప్పు ఉండదన్న మాటను తూచా తప్పకుండా పాటించేస్తున్నారు. ఓ పక్క వరద కష్టాలతో కిందామీదా పడుతూనే.. సరికొత్త భయాల్ని మనసు నిండి నింపుకొని ఉక్కిరిబిక్కిరి పడుతూ.. మరింత శ్రమపడి పోతున్న వైనం తమిళనాడట చాలా ఎక్కువగా కనిపిస్తోంది.