Begin typing your search above and press return to search.

అవునా...నిజమేనా : జగన్... షర్మిల...విజయమ్మ...?

By:  Tupaki Desk   |   8 Jun 2022 3:30 PM GMT
అవునా...నిజమేనా : జగన్... షర్మిల...విజయమ్మ...?
X
పచ్చని కుటుంబాలలో చిచ్చు పెట్టేది ఏది అంటే రాజకీయం అనే చెప్పాలి. అది పెట్టే చిచ్చుని సముద్రమంత నీరు తెచ్చి పోసినా ఆరని దావానలమే, రావణకాష్టమే. అదే పెద్దింటి కుటుంబం, పేరున్న కుటుంబం, రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అగ్ర స్థానంలో ఉన్న కుటుంబం అయిన దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ కుటుంబంలోనూ పాలిటిక్స్ చేరిపోయింది. అందమైన బంధాలను బీటలు వార్చిందా అంటే దానికి సమాధానం డైరెక్ట్ గా దొరకదు కానీ జరుగుతున్న ప్రచారం మాత్రం అవును అనే వస్తోంది.

ఒకనాడు జగన్ షర్మిల, విజయమ్మ ఒకే గొడుగు కింద ఉండేవారు. అన్న కోసం చెల్లి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైసీపీని పటిష్టం చేశారు. నాడు జగన్ జైలులో ఉంటే వైసీపీని భుజానికెత్తుకున్నది షర్మిలమ్మ మాత్రమే. ఇక తల్లి వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ చాటు సతీమణి. ఎండకన్నెరగని మహిళామణి. ఆమె సైతం కుమారుడు భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చారు.

ఎండనక వాననకా రోడ్లను ఊళ్ళను పట్టుకుని తిరిగారు. ఎన్నో సభలు సమావేశాలను నిర్వహించారు. వైసీపీ విజయంలో విజయమ్మ వంతు కూడా చాలా ఉంది. ఇక జగన్ కి రెండు కళ్ళు అంటే తల్లి, చెల్లెలు మాత్రమే. ఇక ఆయనకు కుడి ఎడమలుగా వారు మసలేవారు. ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2019 మే 23న ఒక వైపు ఎన్నికల ఫలితాలు వెల్లువలా వస్తున్నాయి. అన్నీ కలసి వైసీపీ విజయాన్ని భారీ ఎత్తున నమోదు చేస్తున్నాయి. ఈ సమయంలో తాడేపల్లి ఇంట్లో జగన్ షర్మిల, విజయమ్మ అంతా కలసి విజయానందాన్ని పంచుకున్న వైనం ఈ రోజుకూ వైఎస్సార్ అభిమానులకు కళ్ళలోనే ఉంది.

అలాంటిది ఇపుడు అన్న ఇంటికి చెల్లెలు ఎందుకు రావడంలేదు, విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఎక్కడా ఎందుకు కనిపించడంలేదూ ఇవన్నీ ప్రశ్నలే. జవాబులు జరుగుతున్న ప్రచారం నుంచి ఎవరి ఊహకు తోచిన తీరున వారు అన్వయించుకోవడమే. అయితే షర్మిల విజయమ్మలతో జగన్ కి నిజంగా విభేదాలు ఉన్నాయా అంటే ఉన్నాయీ అనేలా ఒక కీలకమైన సమాచారం ఇపుడు బయటకు వచ్చింది. ఒక ప్రముఖ మీడియాలో అల్లిన కధనం ప్రకారం చూస్తే వైఎస్సార్ ఇంటి విభేదాలు అన్నవి జస్ట్ పొగ కాదు నిప్పు లాంటి నిజమే అంటున్నారు.

ఈ మధ్య జగన్ దావోస్ టూర్ కి వెళ్ళినపుడు తెలంగాణా మంత్రి కేటీయార్ తో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఇరు రాష్ట్రాల రాజకీయాలతో పాటు కుటుంబ విషయాలు కూడా చర్చకు వచ్చినట్లుగా ఆ మీడియాలో వచ్చిన కధనం ప్రకారం తెలుస్తోంది. షర్మిలతో విభేదాలు ఎందుకు అని కేటీయార్ ప్రశ్నించినపుడు ఆస్తుల వివాదాలుగా జగన్ చెప్పినట్లుగా తెలుసోంది. ఆస్తిలో చెల్లెలు వాటా అడుగుతోంది అని జగన్ చెప్పినట్లుగా ఆ మీడియా కధనం తెలియచేస్తోంది.

అదే విధంగా ఇక కుటుంబ విషయాలు సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది అని కేటీయార్ చేసిన సూచనకు జగన్ ప్రతిస్పందిస్తూ ఆ దశ దాటిపోయింది అన్నట్లుగా చెబుతున్నారు. ఇపుడు విషయం పూర్తిగా క్లిష్టంగా ఉందని కూడా ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. ఇక ఆస్తులకు సంబంధించి అంతా తన చేతిలో ఏమీ లేదని, న్యాయ వివాదాలు ఉన్నాయని కూడా జగన్ అన్నట్లుగా తెలుస్తోంది

అదే విధంగా ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా ఆస్తులను జప్తు చేసిన సంగతిని కూడా జగన్ ఈ సందర్భంగా చెప్పినట్లుగా పేర్కొంటున్నారు. ఇక తల్లి విజయమ్మతో విభేదాలు ఉన్నట్లుగా జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. తల్లి కూడా షర్మిలకే సపోర్ట్ చేస్తోంది అని ఆయన అన్నట్లుగా పేర్కొంటున్నారు. తన కూతురుకు అన్యాయం చేసినట్లుగా అమ్మ ఫీల్ అవుతోంది అని జగన్ పేర్కొన్నారుట.

ఇక విషయానికి వస్తే ఆస్తులలో కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా సమానంగా ఆస్తి హక్కు ఉంటుందని వైఎస్సార్ పేర్కొనేవారు. తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమే అని వైఎస్సార్ అప్పట్లో అనేవారుట. ఇలా చట్టబద్ధమైన నైతికపరంగా ఉన్న అంశాలను పట్టుకునే షర్మిల ఆస్తిలో వాటా కోరినట్లుగా చెబుతున్నారు.

వీటితో పాటు రాజకీయ కారణాలు కూడా ఇద్దరి మధ్య విభేదాలకు కారణంగా చెబుతున్నారు. ఏపీలో అధికారంలోకి రాగానే జగన్ తనని పక్కన పెట్టేయడాన్ని షర్మిల జీర్ణించుకోలేకపోయారు అని కూడా కధనాలు వచ్చాయి. మొత్తానికి తాను పార్టీకి అన్నకు ఎంతో చేస్తే చివరికి అన్యాయమే జరిగింది అని షర్మిల సన్నిహితుల వద్ద బాధపడుతోంది అంటున్నారు. అయినా సరే ఆస్తులు ఎక్కడికి పోతాయి వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేయడమే కొసమెరుపు.

ఇదంతా ఇపుడు ఎందుకంటే ఒక మీడియాలో వచ్చిన కధనం అంతా ఆసక్తికరంగా ఉండడమే. మరో నెల రోజులలో వైసీపీ వారి ప్లీనరీ జరగనుండగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ హాజరు అవుతారా కారా అన్న చర్చ సాగుతున్న వేళ వెలువడిన ఈ కధనం చాలా డౌట్లను పెంచేసేలా ఉందనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.